ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా నాగార్జునసాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 42,378 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి గత 20 రోజుల నుంచి నీటి ప్రవాహం నిలకడగా వస్తుండటం వల్ల నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది.
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 566.70 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 248.29 టీఎంసీలకు చేరుకుంది. ఈ క్రమంలో అధికారులు 4,107 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి పీక్ అవర్స్‌లో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.