Phone Bill: టెలికాం సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన భారతీ ఎయిర్‌టెల్ సిబ్బంది నిర్వాకం వినియోగదారుడికి కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. అంతర్జాతీయ రోమింగ్ సేవల పథకం కోసం సంప్రదిస్తే తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఆయనకు రూ.1,41,770 బిల్లు వచ్చింది. విదేశాలకు కుటుంబంతో కలిసి సరదాగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర మనోవేదనను మిగిల్చింది. ఈ వ్యవహారంలో భారతీ ఎయిర్‌టెల్ సంస్థ తీరును తప్పుపట్టిన హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 రూ.50 వేల పరిహారం చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని జల్‌వాయు టవర్స్‌లో ఉంటున్న విశ్రాంత వింగ్ కమాండర్ సమర్ చక్రవర్తి, భార్యతో కలిసి బహమాస్ అటు నుంచి యూఎస్‌ఏ వెళ్లాలనుకున్నారు. అంతర్జాతీయ రోమింగ్ కోసం భారతీ ఎయిర్‌టెల్ సంస్థను ఆశ్రయించారు. 2014 నుంచి పోస్ట్‌పెయిడ్ సర్వీస్ వినియోగిస్తున్నానని బేగంపేట్‌లోని ఎయిర్‌టెల్ సేవా కేంద్రం సిబ్బందికి తెలపగా అమెరికా ప్లాన్-బి వినియోగిస్తే బహమాస్‌లోనూ పనిచేస్తుందని చెప్పారు. ఫిర్యాదీ 2018 జూన్ 27న న్యూజెర్సీ చేరుకొని ఆమేరకు రూ.3,999+ రూ.149 రీఛార్జీ చేయించారు. 500 అవుట్‌గోయింగ్ కాల్స్, 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ ఎస్‌ఎంఎస్‌లు, ఇన్‌కమింగ్ కాల్స్ వర్తిస్తాయంటూ సందేశం వచ్చింది. కొత్త ప్లాన్‌ను యాక్టివేట్ చేసినప్పటినుంచి పలుమార్లు అంతర్జాతీయ రోమింగ్ సేవలు అందలేదని పదేపదే డిస్‌కనెక్ట్ అవుతోందని ప్రతివాద సేవా కేంద్రానికి సమర్ ఫిర్యాదు చేశారు. నాస్సౌ, బహమాస్ చేరుకోగానే బిల్లు రూ.1,41,770 అయ్యిందంటూ సందేశం వచ్చింది. అప్రమత్తమైన ఆయన మరోమారు సేవా కేంద్రాన్ని సంప్రదించగా, అక్కడ ఆ ప్లాన్ పనిచేయదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. సేవా కేంద్రం సిబ్బంది చెప్పడంతోనే ఆ ప్లాన్ తీసుకున్నానని, ఇదంతా వారి నిర్లక్ష్యమే అంటూ వాదించారు.