గత నాలుగైదు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 'బుల్లెట్ బండి' పాట తెగ వైరల్ అవుతోంది. తొలుత తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవవధువు సాయి శ్రియ.. తాను మనువాడిన వాడిపై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ పెళ్లి బరాత్‌లో 'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా.. వచ్చేత్తప్పా...' అంటూ ఆమె చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేసింది.
ఈ నెల 14న మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కూతురు సాయి శ్రియకు రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో వివాహం జరిపించారు. పెళ్లి బరాత్‌లో వధువు చేసిన డ్యాన్స్ చూసి ప్రముఖులు కూడా ఈ వీడియోను షేర్ చేసి వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. గాయని మోహన భోగరాజు ఆలపించిన ఈ ‘బుల్లెట్ బండి...’ పాటకు నవ వధువు వేసిన స్టెప్పుల వీడియోను మధ్యప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్ ఎండీగా పని చేస్తున్న రామగుండానికి చెందిన ఐఏఎస్ అధికారి పి.నరహరి ట్వీట్ చేశారు.
అలాంటి వీడియోనే మరొకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల్లో భాగంగా.. బుల్లెట్ బండి పాటకు ఓ నర్సు చేసిన డ్యాన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లోని కారిడార్‌లో ఈ వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. పాటకు తగ్గట్టుగా సదరు నర్సు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. పాటకు తగ్గ హావభావాలు ప్రదర్శించి తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ పాటకు స్టెప్పులేస్తూ.. తోటి వారిని తోడుగా రావాలంటూ కోరడం.. ఆమెను మరింత ఉత్సాహపరిస్తూ అక్కడున్న వారు చప్పట్లు కొడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాల అనంతరం.. ఆటవిడుపుగా పాటకు సదరు నర్సు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది.