ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎంబీబీఎస్ ఫీజులు తగ్గే అవకాశం: ఎన్టీఆర్‌ హెల్త్ వర్శిటీ ఉపకులపతి

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్యలోనూ యాజమాన్య కోటా ఫీజులు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ వర్శిటీ ఉపకులపతి డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ అన్నారు. వైద్య కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన ఆదాయ, వ్యయ వివరాలను బట్టి కొత్త ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేస్తుందని తెలిపారు.

mbbs-fee-structure
mbbs-fee-structure

By

Published : Sep 27, 2020, 8:31 AM IST

పీజీలో తగ్గినట్లే ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ వైద్య విద్యలోనూ యాజమాన్య కోటా ఫీజులు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ వెల్లడించారు. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ ‘బి’ కేటగిరీ సీటును రూ.13,37,057తో భర్తీ చేసినట్లు తెలిపారు. దాంతో ఈ విద్యా సంవత్సరం పీజీ వైద్యవిద్యలో ఫీజులు తగ్గాయన్నారు. వీటి ప్రకారం ప్రైవేటు వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్‌ ‘బి’ కేటగిరీ సీటు ఫీజు రూ.3 లక్షల వరకు తగ్గొచ్చని చెప్పారు. దీనికి అనుగుణంగానే ‘సి’ కేటగిరీ సీట్ల ఫీజులూ తగ్గుతాయన్నారు. వైద్య కళాశాలల యాజమాన్యాల నుంచి వచ్చిన ఆదాయ, వ్యయ వివరాలను బట్టి కొత్త ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేస్తుందని తెలిపారు. ఎంబీబీఎస్‌ తరహాలోనే బీడీఎస్‌ ఫీజులూ తగ్గుతాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో 5,010, దంత వైద్య కళాశాలల్లో 1,440 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఈసారి సీట్ల పెరుగుదలపై ఇప్పటివరకు సమాచారం లేదన్నారు.


*ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి-యోగా కోర్సుల్లో ప్రవేశాలు జరుపుతాం. ఒకే దరఖాస్తు ద్వారా ఈ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తాం.
*కొత్తగా అమల్లోకి వచ్చిన జాతీయ వైద్య కమిషన్‌ జారీచేసే మార్గదర్శకాలకు అనుగుణంగా సీట్ల భర్తీ జరుగుతుంది. సాధారణంగా వైద్యవిద్య ప్రవేశాలు ఆగస్టు 31కల్లా ముగియాలి. ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. నీట్‌ ఫలితాలు అక్టోబరు 12న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నీట్‌ ర్యాంకులు వెలువడిన పదిరోజుల్లో అఖిలభారత కోటా సీట్లు, స్వయంప్రతిపత్తి హోదా కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్ల భర్తీ మొదలవుతుంది. ఇక్కడ తొలివిడత కౌన్సెలింగ్‌ పూర్తయ్యాకే ఇతర రాష్ట్రాల్లో తొలివిడత కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. దీని ప్రకారం అక్టోబరు చివరినాటికి లేదా నవంబరు తొలివారంలో తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కావొచ్చు. ప్రవేశాల పూర్తికి 2 నెలల వరకు పట్టొచ్చు.


*కొవిడ్‌ కారణంగా విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసి, అర్హత సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తాం. అధికారులు నేరుగా వీటిని పరిశీలించి అర్హతలను ఖరారుచేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని అన్నిరకాల సీట్ల భర్తీ విశ్వవిద్యాలయం ద్వారానే జరుగుతుంది.


*రాష్ట్రంలోని 12 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న సీట్లలో 15% జాతీయ కోటాకు అప్పగిస్తున్నాం. ఈ సీట్ల భర్తీ చూస్తే.. జాతీయ కోటాలో మన రాష్ట్ర విద్యార్థులు 60%, ఇతర రాష్ట్రాల వారు 40% చేరుతున్నారు. నీట్‌లో మంచి ర్యాంకులు వచ్చినవాళ్లు వేరే రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల్లో చేరుతున్నారు. ఈసారి కొవిడ్‌ వల్ల ఎక్కువమంది సొంత రాష్ట్రాల్లోనే చేరే అవకాశముంది. జాతీయ కోటాకు రాష్ట్రం నుంచి కేటాయించిన సీట్లు రెండో కౌన్సెలింగ్‌ తర్వాత మిగిలితే.. విశ్వవిద్యాలయానికి తిరిగి అప్పగిస్తున్నారు. 2019-20లో ఇలా 53 సీట్ల వరకూ వచ్చాయి. వీటిని రెండోవిడత కౌన్సెలింగ్‌లో కలిపి భర్తీ చేశాం.


*పలువురు విద్యార్థులు సీటు రాగానే చేరి, తర్వాత ఏవో కారణాలతో వదులుకుంటున్నారు. తొలి కౌన్సెలింగులో బీడీఎస్‌లో చేరి.. తర్వాతి కౌన్సెలింగులో ఎంబీబీఎస్‌లో సీటు వస్తే వదులుకోవడంలో తప్పు లేదు. కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక విద్యార్థులు సీట్లను వదులుకోకుండా.. ఈ ప్రక్రియలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం జరిమానాలు, ఇతర నిబంధనలు విధించింది. 2019-20లో చివరి కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లను వదులుకున్న ముగ్గురు ఎంబీబీఎస్‌ విద్యార్థుల నుంచి రూ.3 లక్షల చొప్పున జరిమానా, 18% జీఎస్టీ కలిపి వసూలు చేశాం. బీడీఎస్‌లో రూ. లక్ష జరిమానా విధిస్తున్నాం.


*ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 85% సీట్లు, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 50% సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తాం. ప్రైవేటు వైద్య కళాశాలల్లో ‘బి’(35%) ‘సి’(15%) కేటగిరీ సీట్లనూ విశ్వవిద్యాలయమే నీట్‌ ర్యాంకులతో భర్తీ చేస్తుంది. దంతవైద్య విద్య, ఇతర కోర్సుల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తాం. మైనార్టీ కళాశాలల్లో సీట్లను సంబంధిత వర్గాల విద్యార్థులతోనే భర్తీ చేస్తున్నారు. వీటిలో సీట్లు మిగిలితే ఇతరులతో నింపుతున్నారు. గతంలో హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పడిన కమిటీ ఎంబీబీఎస్‌లో సీట్ల భర్తీని సమీక్షించింది. ఈ కమిటీ నివేదికపై ప్రభుత్వం జారీచేసే ఆదేశాల ప్రకారం విశ్వవిద్యాలయం చర్యలు తీసుకుంటుంది.

ఇదీ చదవండి

బతుకుతెరువుకోసం వలస వచ్చారు.. ప్రత్యేకత చాటుకుంటున్నారు!

ABOUT THE AUTHOR

...view details