జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్ నిర్ణయించారు. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఫిర్యాదు నమోదు చేసేందుకు ఆస్కారం కల్పించాలన్నారు.
2016లో దిల్లీలో నిర్భయ ఘటన అనంతరం జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా సీఆర్పీసీ చట్టానికి సవరణలు చేశారు. దేశవ్యాప్తంగా జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆపదలో ఉన్నవారిని వెంటనే ఆదుకునేందుకు ఈ జీరో ఎఫ్ఐఆర్ ఉపయోగపడుతుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధితో పనిలేకుండా ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని తీవ్రతను బట్టి చర్యలు తక్షణమే తీసుకునేలా ఈ విధానం ఉంటుందన్నారు. దీని వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు.
మరోవైపు గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణాధికారులకు కార్యశాలను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ప్రారంభించారు. రాష్ట్రంలో 14వేల 967 గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు ఈ నెల 9 నుంచి తరగతులు ప్రారంభిస్తామనన్నారు. తొలుత వారికి శిక్షణనిచ్చే అధికారులకు కార్యశాల నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో మహిళల భద్రతతో పాటు, మహిళలు, బాలికల కోసం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన పెంచడమే వీరి విధి అని వివరించారు.