గ్రామాలు, పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. అయితే, రాజధాని అమరావతి ప్రాంతంలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా రోజులుగా ఇక్కడ అధికారుల పాలనే సాగుతోంది. ప్రస్తుతం అమరావతి గ్రామాల్లో మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ఉద్యమం జరుగుతోంది. ఆందోళనలు కొనసాగిస్తూనే., న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ విచారణ పూర్తయ్యే దశలో ఉంది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయితే.. రాజధాని గ్రామాల్లో మాత్రం ఎన్నికలు జరగడం లేదు. గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల ప్రకటన వచ్చిన సమయంలోనే రాజధాని గ్రామాలను పక్కన పెట్టారు.
నినాదాలు తప్ప... ఎన్నికల్లేవ్..!
ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లోనూ గుంటూరు జిల్లాలోని 3 మండలాల పరిధిలోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరపడం లేదని పంచాయతీరాజ్ శాఖ జీవో ఇచ్చింది. ఇందులో తుళ్లూరు మండలంలోని 16 పంచాయతీలు, తాడేపల్లి పరిధిలో రెండు, మంగళగిరి మండలంలో ఏడు పంచాయతీలు ఉన్నాయి. రాజధాని గ్రామాలను.. ప్రత్యేక కార్పొరేషన్‌గా గుర్తించడం సహా ఇతర మున్సిపాలిటీల్లో విలీనం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు గతేడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రక్రియ ఎంతకూ కొలిక్కి రాకపోవడం వల్ల తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరగటం లేదు.
తాడేపల్లి, మంగళగిరి పురపాలికలతో పాటు సమీప గ్రామాలను ప్రత్యేక కార్పొరేషన్‌గా చేయనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవటంతో ఆ ప్రాంతం రెంటికి చెడ్డ రేవడిలా మారింది. ఫలితంగా పంచాయతీ ఎన్నికల హడావిడి అమరావతిలో కనిపించటం లేదు. కేవలం 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అనే నినాదాలే వినిపిస్తున్నాయి.