NITI AAYOG: కేంద్ర ప్రభుత్వం ప్రధాన రంగాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల అభివృద్ధి కోసం మాత్రమే ఆస్తులను మానిటైజ్ చేస్తుందని నీతిఆయోగ్ పేర్కొంది. అంతేతప్ప భూముల మానిటైజేషన్ విధానం కేంద్రంలో లేదని తేల్చి చెప్పింది. తద్వారా హైకోర్టులో బిల్డ్ ఏపీ మిషన్ తరపున జరిగే విచారణలో ఇంప్లీడ్ కాలేమని రాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఇటీవల జవాబిచ్చింది. ప్రభుత్వ భూముల విక్రయం, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ మధ్య 2019 నవంబరులో ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ భూములను విక్రయించగా వచ్చే నిధులతో నవరత్నాలు, నాడు-నేడు పథకం అమలు, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వ భూములను ఈ-వేలం ద్వారా విక్రయించడంపై గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూముల ఈ-వేలం ప్రక్రియ కొనసాగించవచ్చని, అయితే తుది నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇంప్లీడ్ కావాలని ప్రభుత్వం నీతిఆయోగ్‌కు విజ్ఞప్తి చేసింది. వారు ఇంప్లీడ్ అయితే.. ప్రభుత్వ వాదనకు హైకోర్టులో బలం చేకూరుతుందని భావించింది. దీన్ని సమీక్షించిన నీతి ఆయోగ్ భూముల వ్యవహారం కేంద్రం పరిధిలో లేదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. ‘ఇప్పటికే ఉన్న రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, టెలికం వంటి ప్రాధాన్య రంగాల్లో మౌలిక వసతుల కల్పన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకలాపాల విస్తరణ కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నేషనల్ మానిటైజేషన్ ప్రాజెక్టు (2020-2025 వరకు) ద్వారా ఆస్తులను మానిటైజేషన్ చేస్తుంది. భూముల మానిటైజేషన్ పద్ధతి కేంద్రంలో లేదు’ అని స్పష్టం చేసింది. దీనివల్ల బిల్డ్ ఏపీ మిషన్ వ్యవహారంపై హైకోర్టులో జరిగే విచారణలో నీతి ఆయోగ్ ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు లేవు.
NITI AAYOG: భూముల అమ్మకం కేంద్ర ప్రభుత్వ విధానం కాదు - NITI AYOG ON LAND SELLING AP NEWS
NITI AAYOG: నీతిఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ‘బిల్డ్ ఏపీ మిషన్’పై జరిగే విచారణలో ఇంప్లీడ్ కాలేమని పరోక్షంగా స్పష్టం చేసింది. ప్రధాన రంగాల్లో ఇప్పటికే ఉన్న మౌలిక వసతుల అభివృద్ధి కోసం మాత్రమే ఆస్తులను మానిటైజ్ చేస్తుందని నీతిఆయోగ్ పేర్కొంది.
NITI AAYOG LETTER TO AP GOVT