సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. శాసనమండలిని రద్దు చేయాలని కోరారు. శాసనమండలిలో వైకాపాకు మెజార్టీ పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేస్తే మీపై గౌరవం పెరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. 'మీ అభిమానులు అంతా.. మాట తప్పారు.. మడమ తిప్పరు అనుకుంటారు. మండలి నిర్వహణకు రూ. 60 కోట్ల ఖర్చు వృథా అని అన్నారు. మరీ దాని సంగతేంటని' రఘురామ గుర్తు చేశారు.
సీఎం జగన్ గారికి లేఖ రాశాను. అందులో శాసనమండలిని రద్దు చేయాలని కోరాను. మండలి రద్దుపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిత్యం స్పందిస్తున్నారు. తాజాగా మండలి రద్దుపై వెనక్కి తగ్గేది లేదని నలుగురు నూతన శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగానూ చెప్పారు. అందుకు సీఎం జగన్ తో పాటు.. ఆయన వాణి వినిపించిన సజ్జలకు నా శుభాభినందనలు. వారి ఆశయ సాధనకై మండలి రద్దుకోసం పని చేస్తాను - ఎంపీ రఘురామకృష్ణరాజు
మండలి రద్దుపై తీర్మానం.. ఏం జరిగిందంటే...
శాసన మండలి రద్దుపై శాసనసభ తీర్మానం చేసింది. గతేడాది జనవరి 27వ తేదీన.. తీర్మానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఒక్కరోజు చర్చతోనే మండలికి మంగళం పాడింది. కేబినెట్ భేటీలో మండలిని రద్దుపై తీర్మానం చేసిన అదే రోజూ.. శాసనసభ ఆమోద ముద్రను వేసింది. తీర్మానాన్ని జగన్ ప్రవేశపెట్టగా.. సభాపతి చర్చకు అనుమతి ఇచ్చారు. ప్రతిపక్ష తెదేపా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించంటంతో.. అధికార పార్టీతో పాటు జనసేన ఎమ్మెల్యే రాపాక మాట్లాడారు. సభలో ప్రసంగించిన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని బలపరిచారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న విధాన పరిషత్‌ను రద్దు చేయాలని కోరారు. జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు.