ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కలిసి తినలేం.. లిఫ్టు ఇవ్వలేం

కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే కాదు... జీవితాల్లోనూ ఎన్నో మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ప్రజల జీవితాలు కరోనాకు ముందు.. తర్వాత అన్నంతగా మారిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలపాటు ఇంటికే పరిమితమైన ప్రజలందరూ ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. మనసులో మెదిలే భయాందోళన నడుమ.. మున్ముందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నగరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కలిసి తినలేం.. లిఫ్టు ఇవ్వలేం
కలిసి తినలేం.. లిఫ్టు ఇవ్వలేం

By

Published : May 30, 2020, 4:33 PM IST

కరోనా భయంతో కొన్ని విషయాల జోలికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడటం లేదనే చెప్పాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. కొత్త తరహా జీవితానికి నాంది పలుకుతున్నారు.

పునర్వినియోగం కానివే మేలు

నిన్నామొన్నటివరకు పునర్వినియోగించే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. ప్లాస్టిక్‌ మొదలుకుని అన్ని వస్తువులకు పునర్వినియోగించే వస్తువులనే ఎక్కువగా వినియోగించారు. ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. పునర్వినియోగం జరగని వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక్కసారి వాడిపారేసే వస్తువులైతే మరొకరు తాకే అవకాశం ఉండదు. దీనివల్ల ఒక్కసారి వాడిపారేసే పెన్నులు, సంచులు, తినబండారాల ప్లేట్లు, కాగితాలు, గ్లాసులు.. ఇలా అన్నిచోట్ల ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు.

సాయం అడిగినా.. వాహనం ఆగదే!

ఎండాకాలం.. ఎవరైనా మండుటెండలో నడిచి వెళుతుంటే వాహనదారులు ఆగి మరీ లిఫ్టు ఇచ్చి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు కరోనా భూతం కారణంగా లిఫ్టు అడిగినా ఆపేందుకు వాహనదారులు జంకుతున్నారు. తెలిసిన వ్యక్తులకు దూరంగా ఉంటున్న సమయంలో తెలియని వ్యక్తులకు లిఫ్టు ఇవ్వడమా.. అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దావత్‌కు రాలేను భయ్యా!

ఏ చిన్న విజయం సాధించినా ‘దావత్‌ ఎప్పుడు మామా’ అని అడగడటం మనకు అలవాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిరోజులపాటు దావత్‌లు బంద్‌ కావాల్సిందే. నగరంలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు దావత్‌ల ద్వారా విస్తరిస్తున్నవే. సరదాగా గడిపేందుకో లేదా పుట్టినరోజనో ఒకచోట చేరి పార్టీ చేసుకున్న సందర్భాల్లో కరోనా పంజా విసురుతోంది. అందుకు దావత్‌లకు నగరవాసులు దూరంగా ఉంటున్నారు.

తీసుకెళ్లండి.. తినండి..

హైదరాబాద్‌ వాసులు బిర్యానీప్రియులు. శని, ఆదివారాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు రద్దీగా కనిపించేవి. ప్రస్తుతం వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. కేవలం టేక్‌ అవే(పార్సిల్‌ తీసుకెళ్లడం) సర్వీసులకే అనుమతించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కూర్చుని తినాలంటే ఆందోళన పడాల్సిన పరిస్థితి. పార్సిల్‌ తీసుకెళ్లడం ద్వారా ఇంట్లోనే ఉండి తినే వీలుంటుంది.

వ్యక్తిగత రవాణాకే మొగ్గు

ప్రస్తుతం జిల్లాల బస్సులకే ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన తక్కువేనని చెప్పాలి. బస్సుల వద్ద శానిటైజర్లు వంటివి ఉంచామని అధికారులు చెబుతున్నా.. ప్రజా రవాణాకు మొగ్గు చూపేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. నగరంలోనూ వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. బైకులు ఉన్నప్పటికీ కార్లు ఉంటే వాటినే వినియోగించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details