ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్వచ్ఛ నగరాలనూ పీడిస్తున్న విషజ్వరాలు..! - fevers in andhra pradesh

దోమలు... నగరాలు, పట్టణాలను వణికిస్తున్నాయి. దోమల విజృంభణతో.. జ్వరాలు ప్రభలుతున్నాయి. స్వచ్ఛ నగరాల్లో ముందుంటున్న విశాఖ, కాకినాడ, విజయవాడలో ఈసారి అత్యధికంగా జ్వరం బాధితులు పెరిగారు.

mosquitoes booming   the city dwellers with fever
విజృంభిస్తున్న దోమలు... జ్వరాలతో నగరవాసుల ఇక్కట్లు

By

Published : Dec 10, 2019, 8:26 AM IST

Updated : Dec 10, 2019, 9:54 AM IST

నగరాలు, పట్టణాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు పట్టణాల్లో 24,500 మంది మలేరియా బారిన పడ్డారు. మరో 4,300 డెంగీ కేసులు నమోదయ్యాయి. కేంద్రం ఏటా ప్రకటించే స్వచ్ఛ నగరాల్లో ముందుంటున్న విశాఖ, కాకినాడ, విజయవాడలో ఈసారి అత్యధికంగా జ్వరం కేసులు నమోదయ్యాయి. మరో 35 పట్టణాల్లోనూ రెండేళ్లతో పోల్చిచూస్తే ఈ ఏడాది 28 శాతం మంది అదనంగా జ్వరాలతో మంచానపడ్డారు. అధికారుల నిర్లక్ష్యమూ దీనికి కారణమవుతోంది.

విజయవాడ చుట్టూ ఉన్న అనేక ప్రాంతాలు పంచాయతీల పరిధిలో ఉన్నందున దోమల నియంత్రణ చర్యలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ప్రత్యేకించి గొల్లపూడి, అంబాపురం, నున్న, పాతపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు, కానూరు, వనుకూరు తదితర ప్రాంతాల్లో దోమలతో ప్రజలు యుద్ధం చేస్తున్నారు. ఫాగింగ్‌ యంత్రాలు లేనందున రెండు నెలల వ్యవధిలో కొన్ని వందల సంఖ్యలో జ్వరాల కేసులు నమోదయ్యాయి. విజయవాడలోని సింగ్‌నగర్‌, నందమూరినగర్‌, ఉడా కాలనీ, శాంతినగర్‌, హెచ్‌బీ కాలనీ, కరెన్సీనగర్‌లలో వరద కాలువల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిపేశారు. ఫలితంగా నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 41 డెంగీ కేసులు నమోదయ్యాయి.

విశాఖ చుట్టూ ఉన్న గాజువాక, మల్కాపురం, సింధియా, వేపగుంట, పెందుర్తి, కొమ్మాది, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో దోమల బెడద తీవ్రంగా ఉంది. అపరిశుభ్ర వాతావరణం, ఎక్కడికక్కడే నిలిచిపోయే నీరు దోమల ఉత్పత్తికి కారణమవుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు 725కిపైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. శివారు ప్రాంతాలు కావడంతో అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటైన ఎంవీపీ కాలనీ పరిధి సెక్టార్‌-9లో ఈసారి డెంగీ కేసులు నమోదవడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.

కాకినాడలో ఈ ఏడాది అత్యధికంగా 85 డెంగీ కేసులు నమోదయ్యాయి. రెవెన్యూనగర్‌, డెయిరీఫాం, పల్లంరాజునగర్‌, వైద్యనగర్‌, గొడారిగుంట, గైగోలుపాడులో ఖాళీ స్థలాల్లో చేరే నీటితో దోమలు పెరిగి అనారోగ్యం విస్తరిస్తోంది. ప్రవాసాంధ్రుల్లో చాలామంది ఇక్కడ ఇళ్ల స్థలాలు కొని ఖాళీగా విడిచిపెట్టిన కారణంగా... వర్షాకాలంలో నీరు చేరుతోంది. బాధ్యులను గుర్తించేందుకు స్థలాల్లో నగరపాలక సంస్థ హెచ్చరిక బోర్డులు పెట్టినా యజమానులు స్పందించడం లేదు. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఫాగింగ్‌, ఇతర నిరోధక చర్యలు తీసుకుంటున్నా దోమల బెడద భయపెట్టిస్తోంది.

ఇదీ చదవండి...

పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు వెనుక రాజకీయ వ్యూహం!

Last Updated : Dec 10, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details