- ఇదీ డోనేకల్లు ఎత్తిపోతల పథకం పరిస్థితి. కరవు పీడిత ప్రాంతంలోని 1,000 ఎకరాలకు సాగునీరు అందించి, జీవం పోయడానికి దీన్ని 1989లో ప్రారంభించారు. నిర్మాణంలో లోపాలు, నిర్వహణలో చొరవ లేకపోవడంతో అదే ఏడాది మూతపడింది. ఎత్తిపోతల పునరుద్ధరణకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. కనీసం ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనా వేయలేదు.
పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలం కొరిశీల ఎత్తిపోతల పథకం మోటార్లు రెండేళ్ల నుంచి పని చేయడం లేదు. కేవలం రూ.60 వేలు ఖర్చు చేస్తే వినియోగంలోకి తీసుకురావచ్చు. ఆ కొద్దిపాటి నిధులనూ వెచ్చించే నాథులే లేరు. పార్వతీపురం మన్యం జిల్లాలోని ముకుందాపురం ఎత్తిపోతలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తే మళ్లీ వినియోగంలోకి వస్తుంది. దీని పరిస్థితీ అంతే.. ఎన్టీఆర్ జిల్లాలో వేదాద్రి ఎత్తిపోతల ఉంది. దీని పరిధిలోని 16,500 ఎకరాలకు సాగునీరు అందడంలేదు. దీన్ని బాగు చేసేందుకు రూ.7 కోట్లతో ప్రతిపాదనలున్నా ఆ తదుపరి అడుగు పడలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా వీటి నిర్వహణ, మరమ్మతుల్లో రైతులను భాగస్వాములను చేయాల్సిన బృహత్తర బాధ్యతను ప్రభుత్వ వ్యవస్థలూ వదిలేశాయి. ఆయా పథకాలను ‘ఈనాడు యంత్రాంగం’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రధానంగా నిధులు, నిర్వహణ లేమితో సమస్యలు ఎదుర్కొంటున్న తీరు వెల్లడైంది....
- బాపట్ల జిల్లా కర్లపాలెంలో నల్లమడ వాగుపై రూ.కోటి వ్యయంతో 2013లో ఎత్తిపోతల నిర్మించారు. నిర్వహణ కరవై 500 ఎకరాలకు నీరందడంలేదు. కొత్తగా 200 మీటర్ల పొడవున పైపులైను వేస్తే ఇది అందుబాటులోకి వస్తుంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండలో రూ.1.17 కోట్లతో 2016లో నిర్మించిన ఎత్తిపోతలకు నీటి తీరువా వసూలవక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఏలూరు జిల్లా గూటాల ఎత్తిపోతల, గణపవరం మండలం యనమదుర్రు డ్రెయిన్‌పై ఉన్న రెండు ఎత్తిపోతల పథకాలకు నీటి తీరువా సరిగా వసూలు కావడం లేదు. యనమదుర్రులో పాడైన ఒక మోటారును బాగు చేయించే వారే లేరు. వీటి విద్యుత్తు బకాయిలను ప్రభుత్వమే భరిస్తుందని అప్పట్లో అధికారులు చెప్పినా ప్రస్తుతం రైతులే చెల్లించుకోవాల్సి ఉందంటున్నారు. గూటాల ఎత్తిపోతల మోటార్ల మరమ్మతులకు రూ.3.29 కోట్లకు ప్రతిపాదనలు పంపినా మంజూరు కాలేదు. - ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో 4 పంపులు పాడైతే మరమ్మతులకు రూ.లక్ష ఖర్చయింది. నీటి తీరువా పెంచితే రైతులు ఇబ్బందులు పడుతున్నారని కమిటీ అధ్యక్షుడు గాదె కొండారెడ్డి తెలిపారు.
- అనకాపల్లి జిల్లా చోడవరం మద్దుర్తి ఎత్తిపోతలను ఆపరేటర్ లేకపోవడం, రైతులకు-అధికారులకు మధ్య సమన్వయ లోపంతో వదిలేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఏడింటికి 5 పథకాలు నిరుపయోగంగా ఉన్నాయి. సెరిబయలు-1, 2 ఎత్తిపోతల పథకాల కోసం ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. అరకులోయ మండలం కొత్తవలస పాతాలగెడ్డ, అనకాపల్లి జిల్లా వెంకుపాలెం ఎత్తిపోతల పథకాలు వినియోగంలో లేకున్నా దస్త్రాల్లో పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు.
- శ్రీకాకుళం జిల్లాలోని ఈదుపురం, కుతుమ, బెంకిలి, రుషికుడ్డ, పొత్రఖండ పథకాలు తిత్లి తుపాను సమయంలో దెబ్బతిన్నాయి. ఈదుపురం (1,200 ఎకరాలు) పథకాన్ని రూ.50 లక్షలు వెచ్చించి వేరే చోటకు తరలించాలని అధికారులు ప్రతిపాదించారు. మిగిలిన 4 పథకాలకు రూ.4 లక్షల చొప్పున వెచ్చించి బాగు చేస్తే సరిపోతుంది.
- ఉమ్మడి విజయనగరం జిల్లాలో పని చేయని పథకాలు అధికారికంగా రెండేనని చెబుతున్నా నిజానికి పది పని చేయడం లేదు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పెదగెద్దాడలోని పథకం మోటార్లు పని చేయక నాలుగేళ్లుగా మూలనపడింది. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం ఎత్తిపోతల-1ను 2004లో రూ.83 లక్షలతో ఏర్పాటు చేశారు. మోటార్లు తరచూ పాడవడంతో నిర్దేశించిన పూర్తి ఆయకట్టుకు నీరందడం లేదు.
వైయస్‌ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకం 2016లో రూ.33.82 కోట్లతో నిర్మించి ప్రారంభించారు. ఒంటిమిట్ట చెరువు నుంచి 1,014 ఎకరాలకు నీటిని ఎత్తిపోయాలి. నిర్వహణకు రూ.19 లక్షలు వెచ్చించలేక మూలనపడింది. విద్యుత్తు బిల్లులు పెండింగు ఉన్నాయి. పైపులను బాగు చేయాల్సి ఉంది.
నిధుల లేమి
* పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం ముకుందాపురం వద్ద ఎత్తిపోతలలో రెండు మోటార్లు కాలిపోయాయి, భూగర్భ పైపులైన్లు పగిలిపోయాయి. వీటికి రూ.5 లక్షలు ఖర్చు చేస్తే చాలు.
*ఎన్టీఆర్ జిల్లాలో పాడైన ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తీసుకురావాలంటే రూ.20 కోట్లు అవసరం.
* ఏలూరు జిల్లా గూటాల ఎత్తిపోతలలో మోటార్ల మరమ్మతులకు రూ.3.29 కోట్లకు ప్రతిపాదనలు పంపినా ఫలితం లేకపోయింది.
* బాపట్ల జిల్లా ఓగేరు వాగుపై ఉన్న ఇనగల్లు ఎత్తిపోతల మరమ్మతుకు రూ.6 కోట్లు అవసరం.