పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ... సిలిండర్లు, ద్విచక్రవాహనాలు చెరువుల్లో పడేయటంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సరికాదని, పూర్తిగా ఖండించదగినవని అన్నారు. ధరల పెంపునకు నిరసనగా చాలా ప్రాంతాల్లో నిరసనలు చేసే క్రమంలో.. కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పారు.
జూన్ నెలలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ప్రధాన కార్యదర్శి శైలేందర్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. నిరసనలో భాగంగా ట్యాంక్ బండ్లో తాము ప్రయాణించిన బైక్ను విసిరేసి అత్యుత్సాహం చూపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ ధర 25 రూపాయల పెంపు వ్యతిరేకిస్తూ.. నిరసనలో భాగంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ కార్యకర్తలు సిలిండర్ను హుస్సేన్ సాగర్ నీటిలో వేశారు.
ఈ రెండు ఘటనలపై స్పందించిన కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ''ప్రజలు, ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించేందుకు నిరసనలు అనేవి ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనవి. కానీ చెరువుల్లో సిలిండర్లు, బైక్లు పడేయటమనేది పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవి. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమ్మూద్ అలీ, తెలంగాణ డీజీపీని కోరుతున్నా'' అని ట్వీట్ చేశారు.ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ సైతం అవుతున్నాయి. బంగారం రేటు పెరిగితే ఇలానే పడేస్తారా అంటూ చమత్కరిస్తున్నారు.