కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్న ప్రజల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని.. తెలంగాణ పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. 'ఆస్క్ కేటీఆర్' పేరిట ట్విట్టర్ ద్వారా కొవిడ్‌కు సంబంధించి నెటిజన్లు వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేసుల వివరాలు, ఆసుపత్రుల్లో చేరికల సంఖ్య ఆధారంగానే కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గుతోందని తాను చెప్పినట్లు పేర్కొన్నారు. మొదటి వేవ్‌తో పోలిస్తే రెండో దశ నాటికి రాష్ట్రంలో పడకలు, సదుపాయాలు గణనీయంగా పెంచినట్లు వివరించారు. వ్యాక్సినేషన్ విషయంలో దేశ సగటు కంటే రాష్ట్ర సగటు మెరుగ్గా ఉందని... అయితే వ్యాక్సిన్ల లభ్యతే సవాలుగా మారిందని చెప్పుకొచ్చారు. పదిలక్షల మందికి దేశ సగటు వ్యాక్సినేషన్ 1,29,574 ఉండగా... తెలంగాణ సగటు వ్యాక్సినేషన్ 1,41,939 ఉందని పేర్కొన్నారు.
రెండో డోస్ వారికే ప్రాధాన్యత...
ప్రస్తుతం రెండో డోస్ వారికి ప్రాధాన్యత ఇస్తున్నామన్న కేటీఆర్... కేంద్రం నుంచి టీకాలు ఎక్కువగా పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. టీకాల ఉత్పత్తిదారులతోనూ మాట్లాడుతున్నామని... భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్, రెడ్డీస్ ల్యాబ్స్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. జూలై చివర్లో లేదా ఆగస్టు మొదట్లో డిమాండ్‌కు తగ్గట్లు టీకాలు సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. వీలైనన్ని ఎక్కువ టీకాలు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్న కేటీఆర్... రోజుకు తొమ్మిది లక్షల మందికి టీకాలు వేసే సామర్థ్యం రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఫైజర్, మోడెర్నా టీకాలను కూడా త్వరలో అనుమతించవచ్చని... ఆగస్టు నాటికి బీఈ నుంచి కూడా స్వదేశీ టీకా వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
రాజకీయం తగదు...
దేశంలో ఈ ఏడాది మొత్తం వ్యాక్సినేషన్ కొనసాగుతుందని, నీతిఆయోగ్ ప్రకారం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు 216 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. సరిపడా టీకాలు అందుబాటులో ఉంటే రాష్ట్రమంతా 45 రోజుల్లో వ్యాక్సినేషన్ వేసే వనరులు, సామర్థ్యం ఉందన్నారు. టీకాల విషయంలో ప్రాంతీయతత్వం సరికాదన్నారు. మన రాష్ట్రంలో తయారవుతున్నంత మాత్రాన మొదటి హక్కు మనకే ఉండదని స్పష్టం చేశారు. మహమ్మారిని కూడా రాజకీయం చేయడం తగదన్న కేటీఆర్... టీకాల కోసం గ్లోబల్ టెండర్ల విషయంలో విమర్శలు చేయటాన్ని వారి విజ్ఞతకే వదిలేద్దామని వ్యాఖ్యానించారు.