పోలవరం ప్రాజెక్టు ఎత్తును అంగుళం కూడా తగ్గించమని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదన్నారు. ఎత్తు తగ్గిస్తారని ఆరోపిస్తున్న నేతలంతా వచ్చే ఏడాది డిసెంబర్లో ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రారంభోత్సవం రోజున ప్రాజెక్టు ఎత్తును కొలుచుకోవచ్చని హితవు పలికారు.
చంద్రబాబు అజెండా అమలు చేసేందుకు సీపీఐ నేత రామకృష్ణ పోలవరం వద్దకు వెళ్లేందుకు యత్నించారని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం పోలవరం డ్యాం వద్ద 3 వేల మంది పనులు చేస్తున్నారని, పనులు ఆగిపోతాయనే ప్రాజెక్టు సందర్శనకు సీపీఐ నేతలను అనుమతించలేదని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తుపై అనుమానాలుంటే ఒకరిద్దరితో వెళ్లాలి.. రెండు వందల మందితో వెళ్తామంటే ఎలా అనుమతిస్తామన్నారు. అన్ని పార్టీల నుంచి ఒకరిద్దరు వస్తే పోలవరం వద్దకు తీసుకెళ్తామని అనిల్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుపై ఆరోపణలు చేస్తున్న సీపీఐ నేతలంతా.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని గత ప్రభుత్వం అమలు చేయనప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు కీలకమైన అనుమతులు తీసుకురావడం సహా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసి, రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక అక్కడ వైఎస్ఆర్ విగ్రహం పెడతామన్నారు.