కొత్త వైద్య కళాశాలలు వస్తే ఎక్కువ సీట్లు వచ్చి.. ప్రతిభావంతులు తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ చదివే అవకాశాలు ఉంటాయి. కానీ నిర్వహణ పేరుతో సగం సీట్లను ఎన్నారై కోటా కింద కేటాయించి అధిక ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీల్లో సీట్లు భర్తీచేస్తున్నారు. ‘ఏ’ కేటగిరీలో కన్వీనర్ కోటా ఫీజు రూ.12,500, ‘బీ’ కేటగిరీ కింద సుమారు రూ.14 లక్షలు, ‘సీ’ కేటగిరిలో బీ కేటగిరీ ఫీజుకు ఐదింతలు మించకుండా వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో కన్వీనర్ కోటా మినహా మిగిలిన కేటగిరీలు లేవు.
మొత్తం 1950 సీట్లు?
కొత్తగా వచ్చే 16 వైద్య కళాశాలల్లోని ఏడింట్లో 150 చొప్పున, 9 కళాశాలల్లో 100 చొప్పున కలిపి.. మొత్తం 1950 ఎంబీబీఎస్ సీట్లకు ఎంసీఐ నుంచి అంగీకారం పొందేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో సగం సీట్లను ఎన్నారై కోటాలో రూ.15 లక్షల వార్షిక ఫీజుతో భర్తీచేసే విషయాన్నీ పరిశీలిస్తున్నారు. ఈ కొత్త వైద్య కళాశాలల్లో తరగతులు 2021-22 లేదా 2022-23లో ప్రారంభించే అవకాశం ఉంది. మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, మదనపల్లి వైద్య కళాశాలల్లో 150 సీట్ల చొప్పున, పాడేరు, గురజాల, పులివెందుల, అమలాపురం, నరసాపురం, బాపట్ల, మార్కాపురం, పెనుకొండ, ఆదోనిలో 100 సీట్లతో కళాశాలలు స్థాపించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కొత్త వైద్య కళాశాలల కోసం రూ.8 వేల కోట్ల వరకు అవసరం అవుతుంది.