ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గర్వకారణమైన ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ పరిశ్రమ నుంచి తొలికారు మార్కెట్‌లోకి వచ్చింది. 'మేడిన్ ఆంధ్రా' కియా కారు.... ఇవాళ్టి నుంచి రయ్‌మని దూసుకెళ్తుంది. సెల్టోస్ మోడల్ వాహనాన్ని కియా సంస్థ ఆవిష్కరించింది. నవ్యాంధ్రకు తలమానికంగా నిలిచే కియా మోటార్స్ కార్ల తయారీ పరిశ్రమ... వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన పరిశ్రమ నుంచి... ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నారు. సంస్థలో తయారైన తొలి కారును ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావించినా... వరద పర్యటనలో ఉన్నందున ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ ఆవిష్కరించారు.
కరవు నేలలో కార్లు పండుతున్నాయ్...
దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా, రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల పరిశ్రమ జిల్లాగా ఖ్యాతిగాంచనుంది. వాస్తవానికి దేశంలో తొలి ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించినప్పుడు కియా ప్రతినిధులు ఎన్నో రాష్ట్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా 2016లో పలు దఫాలు అనంతపురం జిల్లాకూ వచ్చారు. భూముల కోసం అన్వేషణ చేశారు. కర్ణాటక, తమిళనాడుతోపాటు, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల ప్రభుత్వాలు కియాను తమ రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, ప్రత్యేక చొరవ చూపి ‘కియా మోటార్స్’ను అనంతపురానికి తీసుకురావడంలో కృతకృత్యులయ్యారు.