రాష్ట్రంలో జేపీ పవర్ వెంచర్స్ ఇసుక బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు అవుతున్నప్పటికీ.. ఆ సంస్థ నుంచి బకాయిలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) రాబట్టుకోలేకపోతోంది. జేపీ సంస్థపై ఏపీఎండీసీ ఒత్తిడి తీసుకురాలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు.. ఏపీఎండీసీకి గతంలో ఇసుక తవ్వకాలు, రవాణా చేసిన గుత్తేదారులు తమ బకాయిల కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్రంలో 2019 సెప్టెంబరు నుంచి ఏపీఎండీసీ ఇసుక తవ్వకాలు, విక్రయాలు చేపట్టింది. ఈ ఏడాది మే 14 నుంచి అన్ని జిల్లాల్లో ఇసుక బాధ్యతలను జేపీ సంస్థకు టెండరు ద్వారా అప్పగించారు. ఆ సమయంలో ఏపీఎండీసీ 14 లక్షల టన్నుల ఇసుక అప్పగించింది. సీసీ కెమెరాలు, తూకపు యంత్రాలు తదితరాలన్నీ ఇచ్చింది. వీటన్నింటికీ కలిపి రూ.150 కోట్లు మేర జేపీ సంస్థ ఏపీఎండీసీకి చెల్లించాల్సి ఉంది.
ఆ ఇసుక విక్రయిస్తున్నా.. చెల్లింపులు లేవు
గతంలో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రీచ్‌ల వారీగా గుత్తేదారులు ఇసుక తవ్వకాలు, రవాణా చేశారు. వీరికి రూ.93 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అలాగే ష్యూరిటీ కింద డిపాజిట్లు చేసిన మొత్తం కూడా భారీగా ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు రూ.120 కోట్ల మేర గుత్తేదారులకు చెల్లించాలి. ఈ గుత్తేదారులు గతంలో తవ్వి.. డిపోలు, నిల్వ కేంద్రాలకు తరలించిన ఇసుకను ప్రస్తుతం జేపీ సంస్థ విక్రయిస్తోంది. అయినాసరే ఏపీఎండీసీకి బకాయిలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు తమ బకాయిలు ఇవ్వాలంటూ గుత్తేదారులు పెద్ద సంఖ్యలో ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. జేపీ సంస్థ ఇవ్వగానే చెల్లింపులు చేస్తామని అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.