రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మనోహర్ మాట్లాడారు. ‘రిపబ్లిక్ ’ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పవన్ ఏం మాట్లాడారో ఒకసారి చూడాలని వైకాపా నేతలకు ఆయన హితవు పలికారు. సినీ పరిశ్రమకు కాపాడమంటే పవన్‌ను కాపాడాలని కాదన్నారు. సినీ కార్మికులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారని మనోహర్ చెప్పారు. వైకాపా ప్రభుత్వ నిర్ణయాలు, గతంలో చేసిన వాగ్దానాలపైనే మాట్లాడారని.. దానిపై ఎందుకు సమాధానం చెప్పరని నిలదీశారు.
జగన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలి!
పవన్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకే సినిమా వాళ్లను వాడుకుంటున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే రాష్ట్రానికి ఏం చేశారు. జగన్ ఇప్పుడు పాదయాత్ర చేయాలి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని కళ్లారా చూడాలి. కొవిడ్ సమయంలో ఏ ఆస్పత్రికైనా జగన్ వెళ్లారా? దేశంలో కొవిడ్ మరణాల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. ప్రతి కుటుంబం నుంచీ ఓ వ్యక్తిని కోల్పోయాం. ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్లే నష్టాలు జరిగాయి. - నాదెండ్ల మనోహర్