ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది.
చారిత్రాత్మకం
దేశంలో అందరికన్నా ముందుగా ఇంటర్ ఫలితాలు విడుదల చేశామని.. రాష్ట్ర చరిత్రలో ఇదొక చరిత్రాత్మకమైన రోజుగా మంత్రి సురేశ్ అభివర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకాల మేరకు సమష్టిగా కృషి చేసి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కరోనా వల్ల అన్నీ ఆలస్యం అవుతున్నా.. అనేక ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. bie.ap.gov.in, www.eenadu.net, www.eenaduprathiba.net లో ఫలితాలు చూడవచ్చు. విద్యార్థుల ఫొటోలు, మార్కులు, గ్రేడులు ప్రదర్శించకూడదని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.