ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధానిపై హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడం.. కోర్టు ధిక్కారమే

Amaravathi Capital: రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు.. రైతులు చేస్తున్న ఉద్యమం 900వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో 'అమరావతిపై హైకోర్టు తీర్పు-సర్కారు తీరు' అనే అంశంపై విజయవాడలో మేధావుల చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాజధానిని ఓ కులానికి అంటగట్టి మాట్లాడటం చాలా శోచనీయమని ప్రభుత్వంపై మేధావులు మండిపడ్డారు. రాజధాని నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పును ప్రభుత్వమే అమలు చేయకపోతే ప్రజలు ఎలా విశ్వసిస్తారని అన్నారు. వ్యవస్థపై నమ్మకం కోల్పోయేలా చేయకూడదని హితవు పలికారు.

వికేంద్రీకరణ పేరుతో రాజధానిని 3 ముక్కలు చేయవద్దు
వికేంద్రీకరణ పేరుతో రాజధానిని 3 ముక్కలు చేయవద్దు

By

Published : Jun 4, 2022, 4:17 PM IST

Updated : Jun 5, 2022, 5:29 AM IST

Intellectuals On Amaravathi Capital: సీఆర్‌డీఏ చట్టానికి, రాజధానికి భూములిచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పాక కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం కోర్టు ధిక్కరణేనని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలగౌడ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి ఒక్కరోజైనా పాలించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం మున్సిపాలిటీకి సంబంధించిన కేసులో 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఇచ్చిన తీర్పు ప్రకారం.. చట్టాన్ని అనుసరించి తమ బాధ్యతల్ని నిర్వహించనందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపైనా క్రిమినల్‌ కేసు పెట్టొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు రావాలి. పారిశ్రామిక, విద్య, వైద్యపరమైన మౌలిక వసతుల కల్పన జరగాలి. అది మర్చిపోయి మూడు రాజధానులతో అభివృద్ధి చేస్తామంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమనుకోవాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి టి.గోపాలరావు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం చరిత్రాత్మక తప్పిదమని పౌరహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, విధానాలు మార్చేస్తే భవిష్యత్తు తరాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనుకుంటే దాని కోసం రాజధానిని ముక్కలు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమం 900వ రోజుకు చేరిన సందర్భంగా ‘హైకోర్టు తీర్పు -సర్కారు తీరు’ అన్న అంశంపై శనివారం విజయవాడలో నిర్వహించిన మేధావుల సదస్సులో వారంతా మాట్లాడారు.

రాజధానిపై హైకోర్టు తీర్పు అమలు చేయకపోవడం.. కోర్టు ధిక్కారమే

ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్‌ గోపాలగౌడ మాట్లాడుతూ.. ‘మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా? అని అన్ని కోణాల్లో పరిశీలించి హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. రాజధానిని విభజించే అధికారం శాసనసభకు లేదని చెప్పింది. తీర్పు చదువుకోండి. అర్థంకాకపోతే నిపుణుల్ని అడిగి తెలుసుకోండి. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టనంత వరకు అదే చట్టం. దాన్ని అమలు చేయకపోవడమంటే హైకోర్టును అగౌరవపరచడమే’ అని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలంటే వారు కోర్టులోనూ, బయటా కూడా మరింత ఉద్ధృతంగా పోరాటం చేయాలని సూచించారు. ‘న్యాయమూర్తే పోరాటం చేయమని చెబుతున్నారేంటని అనుకోవద్దు. మీ పోరాటంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. ఇప్పటికైనా మారకపోతే వచ్చే ఎన్నికల్లో పునర్జన్మ ఉండదని చెప్పొచ్చు’ అని గోపాలకృష్ణ గౌడ వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఎవరు ఆపారు?
‘రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సింది. కానీ ఇప్పటి వరకు వెళ్లలేదు. తీర్పు అమలూ చేయడం లేదు. కోర్టు తీర్పు ఇచ్చాక 30 రోజులు దాటకముందే ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేసింది. దానిలో గత ప్రభుత్వం ఏం చేసిందో, ఏం చేయలేదో చెప్పారు.. కోర్టు తీర్పు ప్రకారం వీళ్లేం చేశారో చెప్పలేదు. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి కోర్టు చెప్పిన గడువులోగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదన్నారు. చివరి వాక్యంలో తాము సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. సుప్రీంకోర్టుకు వెళ్లకుండా వీళ్లను ఎవరు ఆపారు? హైకోర్టు తీర్పు వచ్చి మూడు నెలలైనా ఎందుకు వెళ్లలేదు? హైకోర్టు అంత స్పష్టమైన తీర్పు చెప్పాక కూడా.. ఈ ప్రభుత్వానికి మూడు రాజధానుల ఆలోచన ఉందా? అని ప్రజలు వేస్తున్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని ఆయన మండిపడ్డారు.

అభివృద్ధి అంటే మూడు రాజధానులు కాదు

‘నేను 2016, 2018, 2019, 2022ల్లో అమరావతికి వచ్చాను. అక్కడ కట్టడాలు మూడేళ్ల క్రితం ఏ దశలో ఉన్నాయో, ఇప్పుడూ అదే పరిస్థితి. కొంచెం కూడా అభివృద్ధి చేయలేదు. మూడు రాజధానుల పేరుతో తాత్సారం చేయడం తప్ప ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వం సాధించిందేంటి? విశాఖలో సచివాలయం, కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ పెడతామనడం అభివృద్ధి కాదు. ఈ మూడేళ్లలో అమరావతిలో జడ్జిలకు ఇళ్లు కట్టలేదు. అధికారులకు బంగ్లాలు ఇవ్వలేదు. పాఠశాల, ఆస్పత్రుల భవనాలు కట్టలేదు. ఇలాంటి ప్రభుత్వాలు ఉండాల్సిన అవసరమేంటని ప్రజలంతా ఒక తీర్మానం చేయాలి’ అని పేర్కొన్నారు. ‘విభజన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వచ్చేలా చేసి, యువతకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు కట్టాలి. కరోనా వస్తే క్రోసిన్‌ మాత్ర వేసుకుంటే చాలని చెప్పడం కాదు. కరోనా వస్తే ఇవ్వాల్సిన మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, పడకలు సిద్ధం చేయాలి. ఆస్పత్రులు కట్టాలి. రైతులు, కార్మికులు, మురికివాడల్లో ఉండేవారి పిల్లలకు, ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు విద్యా సదుపాయాలు కల్పించాలి. బతకడానికి దారి చూపించాలి’ అని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తనను సామాజిక మాధ్యమాల్లో దూషిస్తారని.. వాటికి తాను భయపడబోనని చెప్పారు. ‘గతంలోనూ నన్ను కొందరు తిట్టారు. నా మాటలు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నాయని కార్మికులు, రైతులు, యువకులు, బీసీలు, ఎస్సీలు నాకు అండగా నిలిచారు. మీరు నన్ను తిట్టే తిట్లన్నీ మీకే నష్టం చేకూరుస్తాయి. దాని ప్రభావం వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది’ అని పేర్కొన్నారు.

డబ్బుల్లేవని తప్పించుకోలేరు..

రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం డబ్బుల్లేవని చెబితే కుదరదని జస్టిస్‌ గోపాలగౌడ పేర్కొన్నారు. ‘మధ్యప్రదేశ్‌లోని రత్లాం మున్సిపాలిటీలో మురికి కాల్వలు పొంగిపొర్లుతున్నాయని ఒకరు సిటీ సివిల్‌ కోర్టుకి వెళ్లారు. వసతులు కల్పించడానికి డబ్బుల్లేవని మున్సిపాలిటీ చెప్పింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన కేసులో జస్టిస్‌ కృష్ణయ్యర్‌ చరిత్రాత్మక తీర్పు చెప్పారు. డబ్బుల్లేవంటే కుదరదని, మున్సిపాలిటీలో ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి నిధులు కేటాయించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చుల్ని, దుబారాలు తగ్గించుకుని నిధులు కేటాయించాలని సూచించారు. ప్రజలు సహజసిద్ధంగా పొందాల్సిన హక్కుల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పించవద్దని, న్యాయం చాలా ఖర్చుతో కూడుకున్న సుదీర్ఘ ప్రక్రియ అని చెప్పారు. ప్రభుత్వాలు చట్టాల ప్రకారం పనిచేయకపోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించకపోతే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం మున్సిపల్‌ ఛైర్మన్‌ను, కౌన్సిలర్లను, అధికారులను జైలుకి పంపాలని ఆదేశించారు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఎమ్మెల్యేలు కూడా శిక్షార్హులేనన్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది’ అని తెలిపారు.

క్రిమినల్‌ కేసు పెట్టండి.. ఎలా దారికి రారో చూద్దాం!

హైకోర్టు తీర్పు ప్రకారం రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కేసు వేయడంతో పాటు, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను అనుసరించి ప్రైవేటు కేసు వేయాలని హైకోర్టు సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావుకు జస్టిస్‌ గోపాలగౌడ సూచించారు. ‘కోర్టు ధిక్కరణ కేసులో జాప్యం జరుగుతుందనుకుంటే, క్రిమినల్‌ కేసు వేసి మెజిస్ట్రేట్‌ కోర్టుకు రోజూ వచ్చేలా చేయండి. అప్పుడు దారికి వస్తారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలా? వద్దా? ఇప్పటికే చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పుకు తోడు, మరో రూ.1.50 లక్షల కోట్లు అప్పు చేసి రాజధానిని అభివృద్ధి చేస్తారా? తేల్చుకుంటారు’ అని పేర్కొన్నారు.

ఇవీ చూడండి

Last Updated : Jun 5, 2022, 5:29 AM IST

ABOUT THE AUTHOR

...view details