harmful foods without proper supervision: రోడ్డు పక్కన మిర్చీ బండి.. ఫాస్ట్‌ఫుడ్ కేంద్రం.. నక్షత్రాల హోటల్.. స్థాయి ఏదైనా వాటిలో లభించే ఆహార పదార్థాల్లో ఏదో ఒక రూపంలో కల్తీ జరుగుతోందని రాష్ట్ర ఆహార పరిరక్షణ సంస్థ నిర్వహిస్తున్న తనిఖీల్లో వెల్లడవుతోంది. టీ పొడి, పాలు, పండ్లు, పప్పులు, సాస్‌లు, చక్కెరతో చేసే మిఠాయిలు, నూనె, కారంపొడి, బేకరీ ఉత్పత్తులు, నిల్వ, తీపి పదార్థాలు, హోటళ్లలో తయారు చేసిన ఆహారాల వరకూ అన్నింటిలోనూ నాణ్యత ప్రమాణాలు లోపించాయని పరీక్షల్లో తేలింది.
తెలంగాణ ఆహార పరిరక్షణాధికారులు ఏప్రిల్-2021 నుంచి మార్చి-2022 వరకు 4,343 వేర్వేరు నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 383 (8.8శాతం) పదార్థాలు హానికరం, నాసిరకం, నకిలీవని వెల్లడైంది. వీటిలో 2 శాతం నమూనాలను హానికరమైనవిగా గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని ఆహారాలను తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అప్పటికప్పుడు కనిపించే జీర్ణకోశ సమస్యలే కాకుండా.. దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిబ్బంది కొరతే అసలు కారణం..ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతంలో ప్రతి లక్ష మంది జనాభాకు ఒక ఆహార పరిరక్షణాధికారి, పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రతి 50 వేల జనాభాకు ఒక అధికారి ఉండాలి. అయితే రాష్ట్రంలో ఆహార పరిరక్షణాధికారుల (ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్) పోస్టులు 52 శాతం ఖాళీగా ఉన్నాయి. దీంతో ఎప్పటికప్పుడు నిర్వహించాల్సిన నమూనాల సేకరణ, ప్రయోగశాలల్లో పరీక్షలు, నిత్యం పర్యవేక్షణ తదితర ప్రక్రియలు తూతూమంత్రంగా కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. ఇటీవల రాష్ట్రాల వారీగా 2020-21 సంవత్సరానికి ఆహార పరిరక్షణ సూచికలను భారత ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) విడుదల చేయగా.. ఇందులో మానవ వనరులు, సమాచార సేకరణ కేటగిరీలో తెలంగాణకు 20 మార్కులకు గాను 9 మాత్రమే వచ్చాయి. కనీసం జిల్లాకొక ఆహార పరిరక్షణాధికారి కూడా లేరు.
ఇటీవలే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 22 మందిని తీసుకోగా.. మిగిలిన జిల్లాలన్నింటికీ కలిపి కేవలం 14 మందిని నియమించారు. అయినప్పటికీ జీహెచ్‌ఎంసీలో మొత్తం 30 పోస్టులకు 8 ఖాళీలుండగా..32 జిల్లాల్లో 51 ఆహార పరిరక్షణాధికారుల పోస్టులకు గాను 37 ఖాళీగా ఉన్నాయి. కొత్తగా మరో 24 మందిని నియమించడానికి ప్రభుత్వం అనుమతించినా.. ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఎన్ని నమూనాలు తీశారు? ఎన్నింటిని ల్యాబ్‌లకు పంపించారు? అనే అంశాలనూ మార్కుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మానవ వనరుల కొరత కారణంగా ఆ వేగం మందగించింది. ఈ అంశంలో 30 మార్కులకు గాను 11 మార్కులు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి.