Telangana Traffic Challan: తెలంగాణలో పెండింగ్ చలాన్ల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే... వాహనదారులు చలాన్లు చెల్లించడానికి పోటీపడ్డారు. దీంతో సంబంధిత సర్వర్ మొరాయించింది. జరిమానాల చెల్లింపు కాస్త నెమ్మదిగా సాగింది. అయినప్పటికీ నిమిషానికి 700 చలాన్లను వాహనదారులు చెల్లించారు. సెలవు దినం కాకపోతే... మీసేవా కేంద్రాలు అందుబాటులో ఉంటే నిమిషానికి వెయ్యికి పైగా చలాన్లు చెల్లింపు జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. మొదటిరోజు 5లక్షల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించగా... ఇందుకు సంబంధించి ఐదున్నర కోట్ల జరిమానాల రుసుము ప్రభుత్వ ఖజానాకు చేరింది.
మొదటి రోజే 80 శాతం చలాన్ల చెల్లింపు...
Telangana Traffic Challan: ఇవాళ్టి మీసేవా కేంద్రాలు తెరిస్తే పెద్ద ఎత్తున వాహనదారులు... ఆయా కేంద్రాల వద్ద పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు బారులు తీరే అవకాశముంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరగకపోతే... వాహనదారులు ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఈ రాయితీ విధానం ఈ నెల 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో... మొదటి రోజే 80 శాతం చలాన్ల చెల్లింపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.