తెలంగాణలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఇంటర్ పాఠ్యప్రణాళిక(సిలబస్) పూర్తికావటంపై సందేహాలు రేగుతున్నాయి. ప్రత్యక్ష తరగతులు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. అలా మొత్తం 68 పనిదినాలు లెక్కలోకి వస్తున్నాయి. తాజాగా ఒక్కో రోజు ఒక్కో ఏడాది విద్యార్థులకే పాఠాలు చెప్పాలని ఆదేశించినందున సిలబస్‌ను పూర్తిచేయడం కష్టమవుతోందని అధ్యాపకులు ఆవేదన చెందుతున్నారు. మే 1 నుంచి వార్షిక పరీక్షలు జరుగుతాయని ఇంటర్‌బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అంటే కనీసం ఏప్రిల్ 20లోపు పాఠాలు పూర్తిచేయాలి. 180 పనిదినాల పాఠ్య ప్రణాళికను 34 రోజుల్లోనే పూర్తిచేయటం ఎలా సాధ్యమన్నది ప్రశ్నార్థకమవుతోంది. 30 శాతం సిలబస్ పరీక్షల్లో ఉండదని చెబుతున్నా.. అధ్యాయాలు పూర్తిగా తొలగించకపోవడంతో కొన్ని అంశాలనే పక్కనపెట్టనున్నారు. ఈ కొద్ది రోజుల్లోనూ రెండు రోజులు నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలకు పోతాయి. ఇక సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాలి. ప్రయోగ పరీక్షలు జరపాలి.
టీవీ పాఠాలు ప్రసారమైనా...
సెప్టెంబరు 1 నుంచి టీవీల ద్వారా ద్వితీయ ఇంటర్‌కు 2.30 గంటలపాటు, ప్రథమ ఇంటర్‌కు 3 గంటలపాటు పాఠాలు ప్రసారం చేశారు. అప్పటి నుంచి జనవరి నాటికి 70 శాతం సిలబస్ పూర్తి చేశామని అధికారులు అంటున్నారు. నిజానికి.. తరగతి గదిలో 10 పిరియడ్లలో చెప్పే ఒక పాఠ్యాంశాన్ని ఒకటీ రెండు పిరియడ్లలోనే టీవీల్లో పూర్తిచేశారు. ‘గణితంలో సర్కిల్స్ 60-70 పిరియడ్లలో చెప్పేవాళ్లం. టీవీల్లో 3 పిరియడ్లలో పూర్తిచేశారు’ అని గణిత అధ్యాపకుడు ఒకరు తెలిపారు. కళాశాలలు తెరిచాక ఈ రెండు రోజుల్లో తరగతులకు హాజరైన విద్యార్థులను అడిగితే ఆయా పాఠ్యాంశాలపై బిక్కమొహం వేశారన్నారు. అందుకే మొదటి నుంచీ బోధిస్తున్నామని, అదీ పరీక్షల దృష్ట్యానే చెబుతున్నామని హైదరాబాద్‌లోని మహబూబియా జూనియర్ కళాశాల అధ్యాపకుడు ఒకరు చెప్పారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకే తీవ్ర నష్టం.. ఫలితాలపైనా ఆ ప్రభావం పడుతుందని అధ్యాపకులు చెబుతున్నారు.‘ టీవీ పాఠాలతో పాటు మేం ప్రత్యేకంగా జూమ్ పాఠాలు చెప్పినా హాజరు 40శాతం దాటలేదు’ అని కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ చెప్పారు. కనీసం వారం తర్వాత రోజూ తరగతులు జరపడం వల్ల కొంత ప్రయోజనం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీచూడండి:కర్రలు, రాడ్లతో తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు