ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అత్యవసర పరిస్థితి లేనప్పుడు ఆర్డినెన్స్​ ఎలా తెస్తారు?'

పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​కు రాజ్యాంగబద్ధత లేదని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ ఎందుకివ్వాల్సి వచ్చిందో ప్రభుత్వాన్ని వివరణ కోరాలన్నారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ap election commissioner
ap election commissioner

By

Published : Apr 14, 2020, 3:20 AM IST

పదవీకాలం ముగియకముందే రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్​ఈసీ)పదవి నుంచి తనను తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్​.శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వ్యాజ్యంలో ప్రతివాదులు ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, కొత్త ఎస్​ఈసీగా నియమితులైన జస్టిస్ వి.కనగరాజ్​కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మానసం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దురుద్దేశంతోనే తొలగింపు

తొలుత రమేశ్ కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ... పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​కు రాజ్యాంగబద్ధత లేదని అన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అత్యవసర పరిస్థితులు లేనప్పుడు దానిని జారీ చేసే అధికారం గవర్నర్​కు లేదన్నారు. ఆర్డినెన్స్ ఎందుకివ్వాల్సి వచ్చిందో ప్రభుత్వాన్ని వివరణ కోరాలన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడం ద్వారా ఎస్ఈసీ పదవీ కాలాన్ని కుదించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవానికి పిటిషనర్‌ను తొలగించడానికే ఈ చర్యకు పాల్పడిందన్నారు.

లాక్​డౌన్ కొనసాగుతున్న సమయంలో ఆర్డినెన్స్ తీసుకురావడం దురుద్దేశంతో కూడుకుందన్నారు. కొత్త ఎస్ఈసీ నియామకానికి జీవో జారీ చేసిన రోజే తమిళనాడు నుంచి వచ్చి జస్టిస్ వి.కనగరాజ్ బాధ్యతలు స్వీకరించడం చూస్తుంటే మొత్తం ముందస్తు వ్యూహంతో జరిగినట్లు కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ అధికారాల్ని వినియోగించకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త ఎస్ఈసీ ఏమైనా చర్యలు చేపడితే వాటిని ఏవిధంగా సక్రమం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ అధికరణ 243కే ప్రకారం... రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధనలను మార్పుచేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఎన్నికల సంఘంలో సంస్కరణలు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఏజీ నాలుగు వారాల గడువు కావాలని కోరగా అంత సమయం ఇవ్వలేమని తేల్చిచెప్పింది. మూడు రోజులు మాత్రమే ఇస్తామని పేర్కొంటూ ఈనెల 16లోపు కౌంటర్ వేయాలని ఆదేశించింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​పై పిటిషనర్లు 17వ తేదీలోపు రిప్లై వేయాలని సూచించింది.

ఇదీ చదవండి

ఎన్నికల వాయిదా నుంచి తొలగింపు వరకు... కారణాలెన్నో!

ABOUT THE AUTHOR

...view details