ప్రజలకు పోలీసు సేవలు అందించడంలో ఎస్‌ఐలు కీలకమని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అనంతపురం పీటీసీలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి మంత్రితో పాటు డీజీపీ గౌతం సవాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన హోంమంత్రి సుచరిత... స్టేషన్కు వచ్చే బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. దిశా చట్టంతో మహిళలకు రక్షణ పెరిగిందని తెలిపారు. త్వరలో దిశా పెట్రోలింగ్ వాహనాలు ఇస్తున్నామని... రాష్ట్రంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. సాంకేతికత వినియోగంలో 37 జాతీయ పురస్కారాలు రావడం విశేషమని పేర్కొన్నారు.
ప్రతిపక్షం కుట్ర...
ఏ ప్రభుత్వమూ తమకు చెడ్డ పేరు వచ్చే పనులను ప్రోత్సహించదని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ప్రతిపక్షం కొన్ని సంఘటనలను కావాలనే రాద్దాంతం చేస్తూ.. ఎస్సీలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.