ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సిబ్బంది మాట్లాడరు.. మందులివ్వరు.. సొంత వైద్యంతో అనర్థాలు

రాష్ట్రంలో కరోనా సోకి హోం ఐసొలేషన్‌లో ఉండే వారిలో చాలామందికి చికిత్స సరిగా అందడం లేదు. వారి ఆరోగ్య పరిస్థితిని చాలాచోట్ల పట్టించుకోవడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో కొంత మంది బాధితులు సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ పరిణామం అనర్థాలకు దారితీస్తోంది. ఇంట్లోనే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సంక్రమించే ప్రమాదమూ పెరుగుతోంది. ఈ విషయమై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గత వారం ఆందోళన వ్యక్తం చేసింది. సాధ్యమైనంతవరకు బాధితులు నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రానికి సూచించింది.

home isolation problems in andhraprdesh
home isolation problems in andhraprdesh

By

Published : Aug 21, 2020, 5:43 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో హోం ఐసొలేషన్‌లో ఉన్న ఓ వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 50వేల మందికిపైగా హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆసుపత్రులపై భారం తగ్గించేందుకు కొవిడ్‌ లక్షణాలు తక్కువగా ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచుతున్నారు. వీరి బాగోగుల పర్యవేక్షణ సరిగా లేదు. సరైన వైద్య సలహాలు అందకపోవడంతో బాధితులు ఆందోళనకు గురై సొంతంగా మందులు వాడుతున్నారు.

  • పట్టించుకునే వారేరీ?

* ఒంగోలులో ఓ మధ్య వయస్కురాలికి ఈ నెల తొలివారంలో కరోనా సోకగానే ఆరోగ్య సిబ్బంది నుంచి హడావుడిగా ఫోన్లు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచి ఆమె ఆరోగ్యం గురించి విచారించేవారు కరవయ్యారు. మరో కుటుంబంలో ఏడుగురికి గత నెలలో పాజిటివ్‌ రాగా ముగ్గురు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. వీరి వివరాలను ఆరోగ్య సిబ్బంది సేకరించనే లేదు.

* విశాఖతోపాటు శివారు మండలాల్లో ఇళ్లలో ఉండే కొందరికి మందులు అందలేదు.

* తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇళ్లలో ఉన్న బాధితులు గురించి పట్టించుకునేవారు కరవయ్యారు.

* విజయవాడలోని మధురానగర్‌, అన్నపూర్ణానగర్‌, ఇతర చోట్ల హోం ఐసొలేషన్‌లో ఉన్న వారూ ఇబ్బందులు పడుతున్నారు.

* ఇంట్లోనే ఉంచి చికిత్సలు పొందుతున్న వారి నమూనాలను పది రోజుల తర్వాత పరీక్షించాలి. ఈ పరీక్షల నిర్వహణలోనూ జాప్యం నెలకొంది.

* వైరస్‌ సోకి అనుమానిత లక్షణాలు లేకుండా, ఇంట్లో సౌకర్యాలున్న వారికే హోం ఐసొలేషన్‌ అనుమతి ఇస్తున్నామని, మిగతా వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

కేసులు పెరుగుతున్నందున..

కేసుల నమోదు మొదలైన రోజుల్లో బాధితులను తప్పనిసరిగా ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నందున హోం ఐసొలేషన్‌కు ప్రాధాన్యమిస్తున్నారు. ఇళ్లలోనే చికిత్స పొందేందుకు సిద్ధమయ్యేవారికి పారాసిటమాల్‌, విటమిన్‌ సి, డి మాత్రలు, ఇతర మందుల కిట్‌ను ఆరోగ్యశాఖ ఉచితంగా సమకూర్చాలి. పల్స్‌ ఆక్సీమీటర్ల ద్వారా బాధితుల్లో ఆక్సిజన్‌ స్థాయిలను మధ్య మధ్యలో వెళ్లి గుర్తించాలి. స్థానిక వైద్యాధికారులు ఆరోగ్య సిబ్బంది వీడియోకాల్‌లో మాట్లాడుతూ బాధితులకు సూచనలివ్వాలి. కానీ పరిస్థితి భిన్నంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details