ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతులకు సీఆర్డీఏ గడువు పెంచండి..హైకోర్టు ఆదేశం - three capitals for AP news

రాజధాని రైతుల నుంచి అభ్యంతరాల తీసుకునేందుకు ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అభ్యంతరాల స్వీకరించే విధానం ఇదేనా...? అని ప్రశ్నించింది. హైపవర్ కమిటీకి  రైతులు అభ్యంతరాలు ఇచ్చేందుకు వీలుగా గడువు పెంచాలని ఆదేశించింది. ఈనెల 20 మధ్యాహ్నం వరకూ రైతుల అభ్యంతరాలు స్వీకరిస్తామని... హైకోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తెలిపారు. వివరాలను నమోదు చేసిన న్యాయస్థానం... విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

high-court-serious-on-ap-governament-over-amaravathi-issue
high-court-serious-on-ap-governament-over-amaravathi-issue

By

Published : Jan 18, 2020, 5:16 AM IST


అమరావతి ప్రాంత రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నాలుగు రోజుల సమయం ఇస్తే అందులో మూడు రోజులు ప్రభుత్వ సెలవులు ఉన్నాయని.. ఒక్కరోజు గడువులో అభ్యంతరాలు సమర్పించాలని అనడం ఏ విధంగా సమంజసమని ప్రభుత్వాన్ని....హైకోర్టు నిలదీసింది. ఏ విషయాలపై అభ్యంతరాలు తెలియజేయాలో కూడా సర్క్యూలర్‌లో తెలియచేయలేదని మండిపడింది. ఆంగ్లంలో సర్క్యూలర్ ఇచ్చారని.. దీన్ని ఆర్థం చేసుకునేందుకు రైతులంతా... ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జి వర్సిటీల్లో చదువుకుని వచ్చారా అని ప్రశ్నించింది. రాజధానికి భూములిచ్చిన రైతుల జీవితాలతో కూడిన వ్యవహారాన్ని.. డీల్ చేస్తున్నారనే విషయం గుర్తుందా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈనెల 20వ తేదీ మధ్యాహ్నం వరకు...
రాజధానికి భూములిచ్చిన రైతులు, సీఆర్డీఏ కు అభ్యంతరాలు సమర్పించేందుకు... ఈ నెల 14 నుంచి 17 వరకు మాత్రమే గడువు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వెలగపూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు శుక్రవారం హైకోర్టులో వేర్వేరుగా అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎవీ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అడ్వకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్‌ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. ఈనెల 20 తేదీ మధ్యాహ్నం రెండున్నర వరకూ రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని....ఆ వివరాలను సంబంధింత అధికారుల ముందు ఉంచుతామన్నారు. వివరాలను నమోదు చేసిన న్యాయస్థానం... విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గడువు ఇవ్వకుండా ఎలా ముందుకెళ్తారు..!
అంతకుముందు...ఓ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపించారు. మూడు రాజధానుల సిఫార్సు చేస్తూ నిపుణుల కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌... సభలో ప్రస్తావించారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ..సీఆర్డీఏకు అభ్యంతరాలు సమర్పించాలని రైతులను కోరిందన్నారు. సీఆర్డీఏ వెబ్ సైట్‌లో పోర్టల్ ఉంచాలని తెలిపారు. 14 నుంచి 16 వరకూ ప్రభుత్వ సెలవులు ఉన్నాయని వేలమంది రైతులు ఆన్‌లైన్‌లో సమర్పించడం... ఒక్కరోజులో సాధ్యం కాదన్నారు. 17న సర్వర్లు పనిచేయడం లేదన్నారు. అభ్యంతరాల సమర్పణకు ఉంచిన నమూనా సక్రమంగా లేదని తెలిపారు. వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సముచిత గడువు ఇవ్వకుండా ముందుకు ఎలా వెళ్తారని...ఏజీని ప్రశ్నించింది. మరికొంత సమయం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వాన్ని ఆదేశించండి...
మరో పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సతీష్ పరాశరన్... రాజధానికి రైతులు భూసమీకరణలో భూములివ్వడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. అలాంటిది వారితో కూడిన వ్యవహారాన్ని హడావుడిగా చేపట్టడం సరికాదన్నారు. కనీసం సంప్రదింపులకు తావివ్వడంలేదన్నారు. రాజధానిపై నిపుణుల కమిటీ బోస్టన్ గ్రూప్ కమిటీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details