చేయడానికి పని లేక.. తినడానికి తిండి దొరక్క.. సొంతూళ్లకు వెళ్లడానికి వేలకొద్దీ మైళ్ల నడక మొదలుపెట్టిన వలస కూలీల దుస్థితి చూసి హైకోర్టు చలించింది. వారిని ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలిచ్చింది. ఈ సందర్భంగా ‘కన్నీళ్ల మాటున కష్టాల నడక’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’ ప్రచురించిన కథనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
గుంటూరు జిల్లా కాజ టోల్‌గేటు సమీపంలో ఈనెల 13-14 తేదీల మధ్య 24 గంటల సమయంలో ఒక్క చెక్‌పోస్టు మీదుగానే నడక, సైకిళ్ల ద్వారా 1,300 మంది వలస కార్మికులు వెళ్తున్న వైనంపై ‘ఈనాడు’ ప్రచురించిన కథనంలోని అంశాలను గుర్తుచేసింది. ఓ మహిళ నాసిక్ నుంచి సతానీకి నడిచి వెళ్తూ బిడ్డకు జన్మినిచ్చి, కాన్పు అయిన రెండు గంటలకే మళ్లీ నడక మొదలుపెట్టిందంటూ ఓ ఆంగ్లపత్రిక ప్రచురించిన అంశాన్ని గమనంలోకి తీసుకుంది. ఈ ఘటనలు ప్రస్తుత దయనీయ పరిస్థితిని గుర్తుచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో తక్షణం స్పందించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.