పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు..ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ప్రభావితం చూపుతున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీల్‌కు విచారణర్హత ఉందని స్పష్టం చేసింది. లోతైన విచారణ జరపకుండా, ఇరుపక్షాల హక్కులు, బాధ్యతలను పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు... తుది ఆదేశాల్లాగా ఉన్నాయని ఎస్ఈసీ తరపు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పంచాయతీ ఎన్నికల కాలపరిమితి ముగియగా కమిషనర్ చట్టబద్ధమైన అధికారాన్ని ఎన్నికల నిర్వహణ కోసం వినియోగించారని తేల్చిచెప్పింది.
తన పదవీకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని కమిషనర్ పేర్కొన్నారని, అధికార పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారని ఏజీ చేసిన వాదనలను అంగీకరించలేమని తెలిపింది. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో పంచాయతీ, మున్సిపాలిటీ, శాసనసభ ఎన్నికలు నిర్వహించడం వాస్తవం అని, అందులో సందేహం లేదని న్యాయస్థానం గుర్తుచేసింది.
ఎన్నికల నిర్వహణను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు సమర్థించాయని తెలిపింది. టీకా కార్యక్రమంపై కమిషనర్ స్పష్టంగా చర్చించారని తెలిపింది. వ్యాక్సినేషన్ విజయవంతం కావడంలో దిగువస్థాయి నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందని.. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక న్యాయకత్వం లోటును పూడ్చలేమన్న ఎస్ఈసీ వాదనలను ధర్మాసనం తన తీర్పులో గుర్తుచేసింది.
ఎన్నికలు, టీకా ప్రక్రియ రెండు సమన్వయంతో నిర్వహించవచ్చని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని హైకోర్టు తీర్పులో వెల్లడించింది. ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను పరిశీలిస్తే... టీకా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతిఅంశాన్ని కమిషనర్ సంబోధన చేసినట్లు స్పష్టం అవుతోందని తెలిపింది. సింగిల్ జడ్జి పేర్కొన్నట్లు సంప్రదింపుల ప్రక్రియ జరగలేదని చెప్పలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం సమర్పించిన ఏ వివరాల్ని పరిగణనలోకి తీసుకోవడంలో కమిషనర్ విఫలమయ్యారో సింగిల్ జడ్జి కారణాల్ని పేర్కొనలేదని చెప్పింది.
ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయం ఏవిధంగా కరోనా టీకా ప్రక్రియకు అవరోధం కలిగిస్తుందో ప్రాథమిక కారణాలను సైతం సింగిల్ జడ్డి వెల్లడించలేదని... హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిశీలించాకే ఎన్నికలు, టీకా ప్రక్రియ రెండు సమన్వయంతో నిర్వహించవచ్చని ఎస్ఈసీ నిర్ణయం తీసుకుందని హైకోర్టు తన తీర్పులో ప్రకటించింది. స్థానిక ఎన్నికల నిర్వహణ వల్ల.. కేటగిరి 1,2 కిందకు వచ్చే ప్రజలు టీకా ప్రక్రియకు ప్రభావం చూపదని ఎస్ఈసీ నిర్ణయానికి వచ్చిందని... మూడో కేటగిరి వారికి టీకా ప్రారంభం కావడానికి ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఎస్ఈసీ భావించిందని ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పులను పరిశీలిస్తే..ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా, జాప్యం జరకుండా, అడ్డంకులు కలగకుండా న్యాయస్థానం రక్షణగా నిలవాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే.. రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఉంటాయని 'కిషన్ సింగ్ తోమర్' కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. ఎన్నికల సంఘం స్వతంత్రంగా విధులు నిర్వర్తించొచ్చని పేర్కొంది.
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే వ్యవహారం పూర్తిగా ఎన్నికల సంఘానికి ఉంటుందని 'సుప్రీంకోర్టు విస్పష్టంగా పేర్కొందని తీర్పులో వెల్లడించింది. అధికరణ 243(K)(3) ప్రకారం ఎస్ఈసీకి స్వతంత్ర హోదా ఉంటుందని..ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని.. ఎన్నికల షెడ్యూల్ విషయంలో ఎస్ఈసీ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ జడ్జి సస్పెండ్ చేయడం సరికాదంటూ.. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఎన్నికలు, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండీ... పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్