ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్‌ఆర్‌ఈజీఎస్ బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని హైకోర్టు ప్రశ్న - nerges

ఎన్‌ఆర్‌ఈజీఎస్ బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వ్యాజ్యాల్లో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది.

NREGS BILLS
ఎన్‌ఆర్‌ఈజీఎస్ బిల్లుల బకాయిలు

By

Published : Jul 10, 2021, 6:24 AM IST

జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా)లో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద 2018-19లో చేయించిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో మాజీ సర్పంచులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులకు రెండేళ్లుగా బిల్లులు రాక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విజిలెన్స్‌, నాణ్యతపై విచారణ పేరుతో బిల్లులు నిలిపివేయడం, కొన్ని జిల్లాల్లో నాణ్యత లోపం ఉందని రికవరీ పెట్టడంతో ఆందోళన చెందుతున్నారు.

అసలేం జరిగింది?
రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం 2018 ఆగస్టు 1న ముగిసింది. 2021 ఫిబ్రవరిలో మళ్లీ ఎన్నికలు నిర్వహించే వరకూ ప్రత్యేక అధికారుల పాలన సాగింది. తమ పదవీకాలం ముగిసేనాటికి అసంపూర్తిగా నిలిచిపోయిన, మంజూరై ప్రారంభించని పనులను 2018-19లో పలువురు మాజీ సర్పంచులు చేయించారు. ప్రత్యేక అధికారులూ అభ్యంతరం చెప్పకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7.94 లక్షల పనులు చేయించారు. వీటి నాణ్యతను క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీర్లు పరిశీలించి ఇచ్చిన ధ్రువీకరణపై మండల ఇంజినీరింగ్‌ సిబ్బంది కొలతలు తీసి ఎం.బుక్‌లో నమోదుచేశారు. వీటిని డీఈఈ, ఈఈలు ఆమోదించారు. దాంతో పనులకు నగదు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పూర్తిచేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోగా.. 2018 అక్టోబరు 1 నుంచి 2019 మే 31 మధ్య చేసిన పనులపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలతో విచారణ చేయించడంతో కథ అడ్డం తిరిగింది. దాదాపు రూ.2వేల కోట్లకు పైగా బిల్లులు నిలిచిపోయాయి. పనులు పూర్తిచేసినా బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై పలువురు వ్యాజ్యాలు దాఖలుచేశారు. విచారణ సందర్భంగా.. రూ.5 లక్షల్లోపు విలువైన 7.27 లక్షల పనులకు బిల్లుల చెల్లింపుల కోసం రూ.870 కోట్లకు ప్రభుత్వం బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులు ఇచ్చిందని 2021 ఏప్రిల్‌ 22న హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. రూ.5 లక్షలు దాటిన పనుల విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ, రూ.5 లక్షల్లోపు పనులకూ నిధులు రాలేదు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌కు నిధులు జమ చేశామన్నారు.

మాజీ సర్పంచుల్లో ఆందోళన

రూ.5 లక్షలు దాటిన పనులపై రికవరీల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా అధికారులకు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో మాజీ సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 2018-19లో చేసిన పనుల్లో నాణ్యత లోపం ఉన్నట్లు క్వాలిటీ కంట్రోల్‌ విభాగం గుర్తించిందని ఈ ఉత్తర్వుల్లో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పనుల వారీగా ఎంతెంత రికవరీ చేయాలో జడ్పీ సీఈవో, ఎంపీడీవోలకు సూచించారు. కృష్ణా జిల్లాలో 169 పనులకు సగటున గరిష్ఠంగా 70-80% రికవరీ చేయాలని ఆదేశించారు. చందర్లపాడు పంచాయతీలో ఒక సీసీ రోడ్డు పనిపై 100% రికవరీ చేయాలని సూచించారు. రూ.5 లక్షలు దాటిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు ఈ ఆదేశాలను అమలుచేసి, రికవరీ చేసిన నిధులు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ బ్యాంకు ఖాతాలో జమచేయాలని జడ్పీ సీఈవో, ఎంపీడీవోలకు సూచించారు. రెండేళ్ల తర్వాత నాణ్యత లోపం పేరుతో విచారణ చేయించి.. రికవరీ చేయడమంటే మాజీ సర్పంచులను మరింత దెబ్బతీయడమేనని ఏపీ పంచాయతీ పరిషత్‌ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి ఎం.రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా ఎన్నికల్లో గెలిచిన మాజీ సర్పంచులపై రాజకీయ ముద్ర వేసి ఇలా అన్యాయంచేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.

బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు: హైకోర్టు
నరేగా కింద గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. బిల్లుల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్రప్రభుత్వాన్ని ఈ వ్యాజ్యాల్లో సుమోటోగా ప్రతివాదిగా చేర్చింది. 2014 నుంచి ఇప్పటి వరకు నరేగా కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు కేటాయించారో నివేదిక ఇవ్వాలని కేంద్రానికి స్పష్టంచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ శుక్రవారం ఈ ఆదేశాలు జారీచేశారు.

పదవీకాలం ముగిసిపోయినా గ్రామాభివృద్ధి కోసం గుంటూరు జిల్లా రేపల్లె మండలానికి చెందిన మాజీ సర్పంచి చొరవ తీసుకొని రూ.కోటితో ఉపాధిహామీ పనులు చేయించారు. బిల్లులు వస్తే పనులు చేసినవారికి చెల్లింపులు చేయించాలని భావించారు. పనులపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించడం, రెండేళ్లయినా బిల్లులు రాకపోవడంతో పనులు చేసినవారికి సమాధానం చెప్పుకోలేక... పరువు కోసం ఎకరా భూమి విక్రయించి కొంతమందికి సొమ్ము చెల్లించారు.

సర్పంచిగా ఉన్నప్పుడు తీర్మానం చేసిన రూ.80 లక్షల విలువైన ఉపాధి పనులు పదవీకాలం పూర్తయిన వారం తర్వాత మంజూరైనా.. కృష్ణా జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన మాజీ సర్పంచి దగ్గరుండి చేయించారు. ఆరు నెలల్లో వస్తాయనుకున్న బిల్లులు రెండేళ్లు దాటినా రాకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. పనులు చేసినవారు ఆయనపై ఒత్తిడి తేవడంతో ఇల్లు అమ్మి కొన్ని చెల్లింపులు చేశారు.

రికవరీకి ఆదేశాలా?

బిల్లులు చెల్లించకపోగా రూ.5 లక్షలు దాటిన పనులపై రికవరీల కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా అధికారులకు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో మాజీ సర్పంచుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి:

JAGAN PLAYED CRICKET: సీఎం జగన్​ బ్యాటింగ్​..ఎంపీ అవినాష్​ బౌలింగ్​

ABOUT THE AUTHOR

...view details