హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేష్ నిమజ్జనోత్సవంపై అనిశ్చితి నెలకొంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనంపై రెండేళ్లగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయంపై దృష్టి సారించలేదు. ఈ ఏడాది నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశిస్తే, పరిస్థితి ఏంటనేదానిపై మల్లగుల్లాలు పడుతున్న సర్కారు, తుది నిర్ణయం కోసం ఈనెల 28న ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది.
మహానగరంలో గణేష్ నిమజ్జనోత్సవాన్ని విగ్రహాలను ప్రతిష్ఠించాక 11వ రోజు పెద్దఎత్తున నిర్వహిస్తారు. నగరంలో చిన్నా, పెద్దా విగ్రహాలు కలిపి 5 లక్షల వరకు ఉంటాయని అంచనా. వీటిలో లక్షకుపైగానే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. 5 నుంచి 40 అడుగుల విగ్రహాల్లో అధికం సాగర్‌కే వస్తుంటాయి. నగరవ్యాప్తంగా మరో 40 చెరువుల్లోనూ కలుపుతుంటారు.
హైకోర్టును ఆశ్రయించిన పర్యావరణ ప్రేమికులు
నిమజ్జనంతో సాగర్ జలాలు కలుషితమవడమే కాకుండా పర్యావరణ పరమైన సమస్యలు తలెత్తుతున్నాయంటూ కొందరు రెండేళ్ల కిందట హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం జలవనరులను కలుషితం చేయొద్దని, ప్రత్యామ్నాయాలు వెతకాలని ఆదేశించింది. అయినా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనంటూ మళ్లీ తలుపుతట్టారు. ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.