విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. పరిపాలన సంబంధ కారణాలు/సౌలభ్యం కోసం తరలిస్తున్నామని చెబుతున్న నేపథ్యంలో సంబంధిత నోట్‌ఫైల్స్, ప్రొసీడింగ్స్‌తో మూడు రోజుల్లో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. పరిపాలన సంబంధ కారణాలేమిటి? పాలన సౌలభ్యం ఏమిటో తాము పరిశీలించాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పింది. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న ఉత్తర్వులిచ్చింది.
వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదు?
ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తాళ్లాయపాలేనికి చెందిన రైతు కొండేపాటి గిరిధర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు వేర్వేరుగా హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. గిరిధర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్‌బాబు వాదనలు వినిపిస్తూ.. అన్ని అంశాలు పరిశీలించి తరలింపునకు నిర్ణయం తీసుకున్నట్లు జీవోలో పేర్కొన్నారన్నారు. కానీ ఎలాంటి పరిశీలన చేయలేదన్నారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపేయాలన్న దురుద్దేశంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. నిపుణుల కమిటీ ఏర్పాటు చేసినా దాని నివేదికలను బహిర్గతం చేయలేదన్నారు. విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలు సచివాలయంలో భాగం అన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. దురుద్దేశంతో వ్యవహరించిన వారిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. పేర్కొంటే వారిని కోర్టుకు పిలిచి వివరణ కోరేవాళ్లమని తెలిపింది. ఉపన్యాసాలకు న్యాయస్థానాలు వేదిక కాదంది.