Floods in Hyderabad: హైదరాబాద్‌లో మంగళవారం చాలాచోట్ల.. కుండపోతగా వాన కురిసింది. చెరువులు పోటెత్తడంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. రాకపోకలు స్తంభించాయి. నగరంలోని పురానాపూల్‌ను వరదలు ముంచెత్తాయి. భారీగా వరద నీరు చేరడంతో ఈ ప్రాంతంలోని రెండు ఆలయాలు జలదిగ్బంధం అయ్యాయి. కాలనీల్లోకి మోకాలు లోతుకు పైగా నీరు రావడంతో ఇండ్లలోకి వరదనీరు చేరింది.
రహదారులన్నీ జలమయం అవ్వడంతో సామగ్రితో ఉన్న లారీ అందులో చిక్కుకుంది. దీంతో పురానాపూల్, జియాగూడ కాలనీవాసుల ఆహారం తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎందుకీ వానలు..రాజస్థాన్ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు చాలా చోట్ల... భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయండి: Minister KTR review on heavy rains: భారీ వర్షాల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్నిశాఖలు పనిచేయాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ నుంచి అధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల, పరిస్థితులపై సమీక్షించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు.