స్పందించే హృదయానికే ఎదుటి వారికి సాయపడాలన్న తపన ఉంటుంది. తన హృదయాన్ని మరొకరికి దానం చేసి... మరణంలోనూ ఆదర్శంగా నిలిచాడు వీరబాబు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన 34 ఏళ్ల వీరబాబు... కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 12న కూసుమంచికి వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండగా... గొల్లగూడెం వద్ద వీరబాబును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరబాబుకి తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్య సేవల కోసం మలక్‌పేట యశోదాకు తరలించారు. రెండు రోజుల చికిత్స అనంతరం నిన్న వీరబాబుని జీవన్మృుతుడిగా వైద్యులు ప్రకటించారు. ఈ వార్త విని శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులకు.. వైద్యులు అవయవమార్పిడి గురించి వివరించారు. వైద్యుల మాటలు విన్న కుటుంబం.. వీరబాబు తమ మధ్య భౌతికంగా లేకపోయినా... వేరేవాళ్లలో బతికే ఉంటాడన్న మాటతో ఒప్పుకున్నారు. దాదాపు మూడు రోజుల పాటు ప్రాణాల కోసం యుద్ధం చేసి అలసిన వీరబాబు దేహం నుంచి.. గుండెను దానం చేసేందుకు ఒప్పుకుని.. మరో కుటుంబంలో కొత్త కాంతులు విరిసేలా చేశారు.
ఓ ఇంట విషాదం.. మరో ఇంట వెలుగు..
వీరబాబు మృతి ఘటనలో ఓ ఇంట విషాదం నిండగా... మరో ఇంట చిరునవ్వులు చిగురిస్తున్నాయి. నిండా ముప్పై ఏళ్లు లేని ఓ పెయింటర్ అనారోగ్య కారణాలతో నిమ్స్ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేసిన వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. చిన్నవయసు... పేదరికం.. ఇద్దరు పిల్లలు... రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. గుండె మార్పిడి కోసం జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకున్నా... దాత ఎప్పటికి దొరికేనో తెలియని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో జీవన్‌దాన్‌లో రిజిస్టర్ చేసుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాలని నిర్ణయించుకున్న వారికి... ఓ శుభవార్త అందింది. ఆ కుటుంబం కాస్త కుదుటపడింది.
కేవలం 12 నిమిషాల్లో...