కృష్ణమ్మ ఉగ్రరూపం సంతరించుకుంది. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తోన్న వరదతో....ఉవ్వెత్తున కిందకు తరలుతోంది. ప్రకాశం బ్యారేజి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా.....ఈ రోజు 9 లక్షల క్యూసెక్కులు దాటుందని అధికారులు అంచనా వేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలిన 8.6 లక్షల క్యూసెక్కుల వరద నీటికి....మున్నేరు, కట్లేరు నుంచి వచ్చే 70 వేల క్యూసెక్కుల నీరూ కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద కారణంగా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణాజిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 18 మండలాలు వరదనీటికి ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వరద ప్రభావంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. పొలాల్లోని పంట కుళ్లిపోతోంది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రెండు సార్లు వచ్చిన వరదతో తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు....ప్రస్తుత ముంపుతో కోలుకోలేమని అంటున్నారు. జగ్గయ్యపేట మండలంలోని రావిరాలలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ సామినేని ఉదయబాను పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. దివిసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వీ.ఎస్ నాగిరెడ్డి పర్యటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.