ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దశాబ్ద ప్రస్థానం: తెలుగు రాష్ట్రాల రథసారధి నరసింహన్

By

Published : Sep 1, 2019, 4:22 PM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో... తెలంగాణ ఉద్యమ సమయంలో.. యూపీయే ప్రభుత్వం నరసింహన్​కు గవర్నర్​గా కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఆ తర్వాత మోదీ మొదటి హయాంలోనూ ఆయన స్థానం చెక్కు చెదరలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, విభజనానంతరం రెండు రాష్ట్రాలకూ బాధ్యతలు నిర్వర్తించారు. విభజన సెగలు, అనూహ్య రాజకీయ పరిణామాలు, రాష్ట్రపతి పాలన, తెలుగు రాష్ట్రాల సంబంధాలు... ఇలా అన్నింటికీ రాష్ట్ర మొదటి పౌరుడిగా ప్రత్యక్ష సాక్షి ఈ.ఎస్​.ఎల్ నరసింహన్. దాదాపు.. దశాబ్ద కాలం పాటు గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన నరసింహన్ గురించి "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం.

esl narasimhan

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ్ దత్ తివారీ రాజీనామా కారణంగా ఖాళీ అయిన స్థానంలో గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు ఈఎస్​ఎల్ నరసింహన్. అప్పటి వరకు ఛత్తీస్​గఢ్​ గవర్నర్‌గా ఉన్న ఆయన 2009 డిసెంబర్ 29న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2012 మే 3వ తేదీన నరసింహన్‌ రెండోసారి గవర్నర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో యూపీఏ ప్రభుత్వానికి నమ్మిన బంటుగా వ్యవహరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతోనూ సమావేశమై విమర్శల పాలయ్యారు. ఉద్యమం తారస్థాయికి చేరుకోవడం, నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు వేస్తోన్న తరుణంలో నరసింహన్ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీరణ చట్టం పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందడం వల్ల సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి పాలన వచ్చింది. గవర్నర్‌గా నరసింహన్‌ రాష్ట్ర పాలనను నడపించారు.

యూపీఏ ప్రభుత్వంలోనే కాదు, ఎన్డీఏ సర్కారులోనూ...

2014 సాధారణ ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏ స్థానంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. విభజన అనంతర పరిణామాలు, సమస్యలను దృష్టిలో ఉంచుకొని తన అవసరాన్ని గుర్తు చేసేలా కేంద్రాన్ని ఆకట్టుకునేలా వ్యవహరించిన నరసింహన్... వారి విశ్వాసాన్నీ చూరగొన్నారు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చినప్పటికీ నరసింహన్‌ను మోదీ ప్రభుత్వం కొనసాగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌గా ఆయనే సరైన వ్యక్తని నమ్ముతూ వచ్చింది. విభజన వివాదాల కారణంగా గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. విద్యుత్, నీరు, ఉద్యోగులు, భవనాలు, సంస్థల విభజన అంశాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరుపుతూ కృష్ణా జలాలు, సాగర్ వివాదాన్ని తాత్కాలికంగా సద్దుమణిగేలా చేశారు. అయితే 9, 10 షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ పలుమార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ నరసింహన్‌ ఏమీ చేయలేదన్న విమర్శలున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కేసీఆర్​ను వెనకేసుకొస్తున్నారంటూ ఏపీ మంత్రులు విమర్శల వర్షానికి దిగారు. పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అధికార పార్టీలు మంత్రివర్గంలో చేర్చుకోవడం తదితర అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

నలుగురు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం...

2018లో శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణయానికి గవర్నర్ నుంచి పూర్తి సానుకూలత లభించింది. మంత్రివర్గ తీర్మానం చేసే ముందు రోజు రాజ్ భవన్ వేదికగా ఉన్నతాధికారులు రిహార్సల్స్ చేయడమే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌గానూ నరసింహన్ రికార్డు సృష్టించారు. కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు, జగన్‌లతో ప్రమాణం చేయించారు. ఇక పండగలు, ప్రత్యేక సందర్భాల్లో రాజ్ భవన్‌ను సాంస్కృతిక కేంద్రంగా మార్చేవారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగపడాలని, వైద్యులు సేవాదృక్పథంతో పని చేయాలని పదేపదే చెప్పే గవర్నర్... స్వయంగా గాంధీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకునేవారు. స్వతహాగా మంచి భక్తుడు అయిన గవర్నర్.. తరచూ పుణ్యక్షేత్రాలకు వెళ్తుండటంపై విమర్శలూ ఉన్నాయి.

తర్వాత ఏంటి?

దాదాపు దశాబ్ద కాలం పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రథమ పౌరుడిగా వ్యవహరించిన ఈఎస్ఎల్ నరసింహన్​ను.. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ బాధ్యతల నుంచి కేంద్రం తప్పించింది. బిశ్వభూషణ్ హరిచందన్​ను ఆంధ్రా గవర్నర్​గా నియమించింది. అప్పుడే.. తెలంగాణకూ కొత్త గవర్నర్​ను నియమిస్తారని ఊహాగానాలు రాగా.. ఇప్పుడు కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకుని.. తమిళనాడు భాజపా అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్​కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు నరసింహన్ ఏం చేయబోతున్నారు? ఆయన తర్వాత అడుగులు ఎటువైపు పడనున్నాయి? జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్​తు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నరసింహన్​కు.. జాతీయ స్థాయిలో ఏమైనా కీలక బాధ్యతలు దక్కనున్నాయా? అంటూ రకరకాల చర్చలు జోరందుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details