శుభవార్త.. విద్యార్థుల బస్పాస్ పరిధి పెంపు
విద్యార్థుల బస్ పాస్ రాయితీ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో 15 వేలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. బస్పాస్ రాయితీ పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న బస్ పాస్ పరిధి 35 కిలోమీటర్లను 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొన్ని చోట్ల పాఠశాలలు, కళాశాలలు దూరంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపింది. ఆటోలు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లటం వల్ల విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నట్లు, ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు రాయితీ పాస్ల పరిధిని పెంచినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 15 వేలమందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.18.5 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.