కరోనా కారణంగా వాయిదా పడిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను ఈ ఏడాది నవంబరు నెల వేతనంతో ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొదటి విడత వాయిదా వేతనాన్ని డిసెంబరు ఒకటో తేదీన ఉద్యోగులు అందుకోనున్నారు. విడతల వారీగా ఉద్యోగుల బకాయి వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపినట్టు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. నవంబరు నెల నుంచే వాయిదా జీతాల చెల్లింపు ఉంటుందని ఉద్యోగుల ఫెడరేషన్ స్పష్టం చేసింది.
కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి.. సగం జీతాలను ఐదు విడతల్లో చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మొదటి విడత ఈ ఏడాది నవంబరు నెల జీతంతో నగదుగా చెల్లించనున్నారు. మరోవైపు 2018 జులై నుంచి 2019 వరకూ పెండింగ్లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. 2020 నుంచి రావాల్సిన డీఏను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. పెండింగ్లో ఉన్న డీఏలలో మొదటి విడతగా 2021 జనవరి నుంచి ఇక రెండో డీఏను 2021 జులై నుంచి అలాగే మూడో విడత డీఏను 2022 జనవరి నుంచి చెల్లించనున్నట్టు ప్రభుత్వం తెలియచేసింది.