కరోనా కారణంగా గతేడాది నిరాడంబరంగా నిర్వహించిన గణేశుడి ఉత్సవాలు.. ఈసారి హైదరాబాద్‌లో వైభవంగా జరిగాయి. లంబోదరుడి శోభాయాత్ర(ganesh shobhayathra at hyderabad) ఆదివారం ప్రశాంతంగా సాగింది. నవరాత్రులు విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి(Ganesh Immersion) చేరాడు. మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం కురిసినా భక్తులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. నగర వ్యాప్తంగా 14 మార్గాల్లో ఈ యాత్ర ప్రశాంతంగా నిర్వహించారు. చివరికి గణపయ్యలు హుస్సేన్‌సాగర్‌కు చేరుకున్నారు.
భక్తుల కిటకిట..
భక్తజన సందడితో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్డు, లోయర్ ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిశాయి. డీజేలు, డప్పుల దరువులు, నృత్యాలతో భక్తులు సందడి చేశారు. యువత, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరంలోని 25 ప్రత్యేక కొలనులు, 33 చెరువుల వద్ద నిమజ్జనం చేశారు.
ప్రణాళికాబద్ధంగా మహాగణపతి నిమజ్జనం..
శనివారం రాత్రి నుంచే నగరంలో నిమజ్జన సందడి(Ganesh Immersion at Hyderabad) కన్పించింది. కాలనీలు, అపార్ట్‌మెంటు వాసులు బృందాలుగా వెళ్లి గణనాథులను నిమజ్జనం చేశారు. ఉత్సవంలో జాప్యానికి తావియ్యకుండా ముందుగానే ఖైరతాబాద్ గణపతి తొలుత నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శనివారం రాత్రి నుంచే మహాగణపతి దర్శనాన్ని నిలిపివేశారు. ఆదివారం వేకువజామున 5 గంటలకే విగ్రహాన్ని భారీ వాహనంపైకి ఎక్కించారు. 8 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. లక్డీకాపుల్, టెలిఫోన్ భవన్, సచివాలయం మార్గం గుండా ఎన్టీఆర్ మార్గ్‌లోని భారీక్రేన్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు నిమజ్జనం పూర్తయింది. బాలాపూర్ గణేశ్‌యాత్ర ఉదయం 11 గంటలకే మొదలైంది. సాయంత్రం 7.30 గంటలకు సాగర్‌లో నిమజ్జనం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.
మంత్రుల విహంగ వీక్షణం...
నిమజ్జనోత్సవాల పర్యవేక్షణకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీసీ అంజనీకుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్‌లో ట్యాంక్‌బండ్, పాతబస్తీ, ఇతర నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
నిమజ్జనానికి తరలివచ్చిన భక్తుల ఆకలి తీర్చేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. అబిడ్స్‌లో రాత్రి ఒంటి గంట నుంచి 60 వేలమందికి భాగ్యనగర్ కమాడ్ సేవ సంఘ్ ప్రతినిధులు అల్పాహారాన్ని అందించారు. 23ఏళ్లుగా ప్రతిఏటా ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ్ ప్రతినిధులు తెలిపారు.