Rivers Interlinking:నదుల అనుసంధానంలో ఓ ముందడుగు పడింది. రెండు దశాబ్దాలుగా చర్చలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి ఇది పరిమితం కాగా, మొదటిసారిగా ఉత్తర్‌ప్రదేశ్-మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే కెన్-బెట్వా నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఉత్తర్‌ప్రదేశ్-మధ్యప్రదేశ్‌లకు ప్రయోజనం కలిగించే కెన్-బెట్వా అనుసంధానం కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేశారు.
మొదటి దశ వల్ల 9.08 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుండగా, రూ.44,605 కోట్ల వ్యయమవుతుంది. ప్రస్తుత సంవత్సరం సవరించిన బడ్జెట్‌లో రూ.4300 కోట్లు , వచ్చే సంవత్సరం రూ.1400 కోట్లు కేటాయించారు. నిర్మాణ వ్యయంలో 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. అనుసంధానానికి గతంలో నాబార్డు ద్వారా నిధులివ్వగా.. ఈ ప్రాజెక్టుకు నేరుగా బడ్జెట్‌లోనే కేటాయింపులు చేయడం గమనార్హం.
గోదావరి-కావేరిపై ముందుకెళ్లేనా?
నదుల అనుసంధానం ప్రతిపాదనలో ఒడిశాలోని మహానది-గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి నదుల అనుసంధానం ఉంది. మహానదిలో నీటి లభ్యతపై ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రత్యామ్నాయంగా గోదావరి నుంచి కావేరి వరకు అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మొదట గోదావరిపై జనంపేట నుంచి, తర్వాత అకినేపల్లి వద్ద నుంచి ప్రతిపాదించి చివరకు ఇచ్చంపల్లి నుంచి నీటిని మళ్లించేలా ఖరారు చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక ముసాయిదాను 2019లో భాగస్వామ్య రాష్ట్రాలకు పంపారు.