'న్యాయమూర్తులపై ఏపీ ప్రభుత్వ ఆరోపణలు కచ్చితంగా కోర్టు ధిక్కరణే' ‘‘ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైన, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజేయ కల్లం విలేకరుల సమావేశం పెట్టడం అనుచితం. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది’’ అని సీనియర్ న్యాయవాది, తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తాజా పరిణామాలపై ‘ఈనాడు- ఈటీవీ భారత్’తో మాట్లాడారు.
‘రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత ప్రవర్తనపై పార్లమెంటు లేదా శాసనసభలలో సైతం చర్చించడానికి వీలులేదు. అలాంటిది ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి పలువురు న్యాయమూర్తులపై బహిరంగంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం ఆక్షేపణీయం. నా దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తనంతట తానుగా(సుమోటో) తీసుకొని విచారించి తగు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి నిరాధార ఆరోపణలతో ఫిర్యాదులను అనుమతిస్తే న్యాయవ్యవస్థ కుప్పకూలుతుంది. దాని స్వతంత్రత దెబ్బతింటుంది. అంతిమంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది. గతంలో ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ అవహేళనతో కూడిన వ్యాఖ్యలు చేస్తే సర్వోన్నత న్యాయస్థానం ఆయన్ని పిలిపించి మందలించింది. ఇప్పుడు జరుగుతున్నది అంతకంటే తీవ్రమైన వ్యవహారం.
నిజంగా ఆధారాలుంటే ఏం చేయాలి
ఎవరైనా సుప్రీంకోర్టు/హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి ఆరోపణలపై ఆధారాలు ఉంటే ముఖ్యమంత్రి వాటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదా రాష్ట్రపతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అంతేగానీ మీడియాలో ప్రచారం చేయకూడదు. అలా చేస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. న్యాయమూర్తిపై రాష్ట్రపతికి ఫిర్యాదు అందినా... వాటిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే పంపిస్తారు. ఆ ఫిర్యాదును ఆయన పరిశీలించి, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనుకుంటే ముందుగా సంబంధిత న్యాయమూర్తి వివరణ తీసుకుని, తదుపరి అంతర్గత విచారణ చేయిస్తారు. దానిలో తప్పులు నిర్ధారణ అయితే అభిశంసన కోసం ప్రధానికి సిఫారసు చేస్తారు. ఇదీ జరగాల్సిన ప్రక్రియ. గతంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామస్వామి, కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రిసేన్ తదితరులపై ఇలాంటి ఆరోపణలు వస్తే కమిటీ ద్వారా విచారణ చేయించారు. ఆధారాలున్నాయని భావించి అభిశంసన నిమిత్తం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రధానమంత్రికి నివేదించారు. అంతేకాని తీర్పులు తమకు అనుకూలంగా రావడం లేదని ఆరోపణలు చేసి, మీడియా ద్వారా వాటికి ప్రచారం కల్పించడం అనుచితం.
ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించాల్సిందే
ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కోర్టులు సమీక్షించాల్సిందే. తప్పులుంటే చక్కదిద్దాల్సిందే. లేకపోతే నియంతృత్వానికి దారి తీస్తుంది. సామాన్యుడికి న్యాయం దక్కదు.
ముగ్గురు న్యాయమూర్తుల గురించి ప్రత్యక్షంగా తెలుసు
ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి, జస్టిస్ ఎ.వి.శేషసాయిల ఎదుట... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోను, తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గాను, సీనియర్ న్యాయవాదిగానూ పలు కేసులు వాదించిన అనుభవం నాకుంది. ఆ న్యాయమూర్తులు ముగ్గురూ నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉంటారు. జస్టిస్ ఎన్.వి.రమణ పదోన్నతిపై హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు కూడా ఒక రాజకీయపార్టీకి చెందినవారు నిరాధార ఆరోపణలతో ఆయన్ని నిలువరించేందుకు పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతోపాటు జరిమానా కూడా విధించింది. మళ్లీ ఇప్పుడు... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే సమయంలో ఆయనపై నిరాధార ఆరోపణలు మోపుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి బాగా లేదు. ఒకరు హైకోర్టు న్యాయమూర్తి అవుతున్నారంటే ఆయనకు వ్యతిరేకంగా వంద ఫిర్యాదులు వెళుతున్నాయి.
40 ఏళ్ల అనుభవంలో ఇలాంటిది చూడలేదు...
తమకు తీర్పులు అనుకూలంగా రావడంలేదని న్యాయమూర్తులపై ఇలా ఒక రాష్ట్ర ప్రభుత్వం నిరాధార ఆరోపణలు చేయడం నా 40 ఏళ్ల అనుభవంలో ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి ధోరణులను కట్టడి చేసేలా సుప్రీంకోర్టు వ్యవహరించాలి. లేకపోతే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వారికి అనుకూలంగా తీర్పులు రాకుంటే న్యాయమూర్తులపై ఇలాగే ఆరోపణలు చేసే ప్రమాదముంది. ఇది న్యాయవ్యవస్థ ఉనికికే ప్రమాదం. బయట ఎక్కడ ఏది జరిగినా న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయిస్తారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే న్యాయవ్యవస్థపై పౌరులకు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.
హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టూ సమర్థించింది
ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే దానర్థం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దురుద్దేశంతోనే అలాంటి తీర్పులు ఇచ్చినట్లా? ఇలాంటి ఆలోచనా ధోరణి సరికాదు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకునే విషయంలో, ఎన్నికల కమిషనర్ తొలగింపు విషయంలో సుప్రీంకోర్టు... ఏపీ హైకోర్టు తీర్పులకు అనుగుణంగానే స్పందించింది. ఇలాంటివి జరిగినపుడు తమ నిర్ణయాల్లో లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. గతంలో ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకునే ముందు అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుని చట్టపరంగా చెల్లుబాటు అవుతాయో లేదో తెలుసుకునేవారు. అలాంటి కసరత్తు చేస్తే కోర్టుల్లో సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి.
అవినీతి కేసులపై వేగం పెంచాలి
ప్రజాప్రతినిధుల అవినీతి కేసులపై సత్వరం విచారణ చేపట్టి, దోషులుగా తేలితే చట్టసభల్లో అడుగు పెట్టకుండా చూడాలన్నది సుప్రీంకోర్టు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, శిక్ష విధించాక అప్పీలు చేసుకోవడానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నది సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు) హన్సారియా అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో కేసులు నమోదు చేసి దశాబ్దం దాటుతున్నా సమన్లు జారీ కావడంలేదని, అభియోగ పత్రం దాఖలు, అభియోగాల నమోదు ప్రక్రియ, విచారణ ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తి కావాల్సిందేనని ఆయన సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజకీయ నాయకులు అధికారంలో ఉండి, ఆ అధికారాన్ని ఆధారంగా చేసుకుని అవినీతిలో భాగస్వాములై కోట్ల రూపాయలను వెనకేసుకున్నట్లు ఆరోపణలకు సంబంధించి సత్వర న్యాయం జరగాలన్నది హన్సారియా అభిప్రాయం. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం అవినీతికి పాల్పడినవారికి వారికి శిక్ష విధించాలి. శిక్ష విధించిన రోజు నుంచి ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. నేరాల్లో భాగస్వాములైన వారు చట్టసభలకు రాకుండా చేయాలన్నది చట్టం లక్ష్యం. శిక్ష పడినవారు ఏ పదవిలో ఉండటానికి అర్హులు కాదని చట్టాల్లో పొందుపరిచారు.
ఇవీ చదవండి: