మార్కెట్లో కిలో సాధారణ బియ్యం రూ.30. ఒక మోస్తరు నాణ్యమైన బియ్యం కావాలంటే కిలో రూ.40 పైమాటే. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు సగటున కిలో రూ.25కే ఎగుమతి చేస్తున్నారు. క్వింటానో, టన్నో కాదు.. గతేడాది ఏపీ నుంచి ఏకంగా 4.32 కోట్ల క్వింటాళ్ల బియ్యాన్ని ఇలా ఎగుమతి చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకంటే కనీసం రూ.500-రూ.600 మధ్య తగ్గించి కొంటేనే ఇంత తక్కువ ధరకు విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఉంటుంది. అన్నదాతలందరికీ మద్దతు ధర దక్కుతోందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న నేపథ్యంలో మరి ఇదెలా సాధ్యమవుతోంది? రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొని... రీసైకిల్ చేసి ఎగుమతి చేస్తున్నారా? అనే చర్చ అధికారవర్గాల్లోనే నడుస్తోంది. ఒకవేళ రైతుల నుంచే తక్కువ ధరకు కొంటే మద్దతు విషయంలో అన్యాయం జరుగుతున్నట్లే లెక్క. అలాకాకుండా రేషన్ బియ్యాన్నే రీసైకిల్ చేస్తుంటే... ప్రజాపంపిణీపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును దళారులు దోచుకుంటున్నట్లే అవుతుంది. ఈ రెండింటిలో ఏదైనా అనైతికమే అని పేర్కొంటున్నారు. గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లే బియ్యం ధర కిలో రూ.28 వరకు ఉంది. మన రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే బియ్యం ధర అంతకంటే తక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2021 నవంబరు వరకు జరిగిన బియ్యం ఎగుమతుల్లో 40% ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్లాయి. కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని కిలో రూ.10 చొప్పున కార్డుదారుల నుంచి కొని.. రీసైకిల్ చేసి రూ.25 చొప్పున ఎగుమతి చేయడమూ కారణమేనని అంటున్నారు. క్వింటా ధాన్యానికి ప్రభుత్వం రూ.1,960 మద్దతు ధర నిర్ణయించింది. ఈ ధరకు ధాన్యం కొని మర పట్టిస్తే సుమారు 67 కిలోల బియ్యం వస్తుంది. అంటే కిలో ధర రూ.29.25 అవుతుంది. దీనికి మిల్లింగ్, హమాలీ, రవాణా తదితర ఖర్చులు కలిపితే రూ.33 వరకు అవుతుంది.
క్వింటా రూ.1,400 చొప్పున కొంటేనే సాధ్యం
క్వింటా ధాన్యాన్ని రూ.1,400 చొప్పున కొని మిల్లింగ్ చేస్తే వచ్చే 67 కిలోలకు... కిలో బియ్యం రూ.21 చొప్పున అవుతుంది. దీనికి ఎగుమతి, దిగుమతి ఖర్చులు, కమిషన్, రవాణా, ఇతర వ్యయాలు కలిపితే కిలో రూ.25 చొప్పున ఎగుమతి చేసేందుకు వీలుంటుంది. అంటే మద్దతు ధర కంటే క్వింటాకు రూ.560 తక్కువకే రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారని తెలుస్తోందని కొందరు అధికారులు పేర్కొంటున్నారు.
రేషన్ బియ్యం రీసైకిల్...