ROADS : ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు మహాపాదయాత్ర చేస్తున్న సమయంలో.. వారి గ్రామాల్లోని ప్రజాధనాన్ని దుండగులు దోచుకుపోతున్నారు. ఇప్పటి వరకు నిర్మాణంలో ఉన్న రహదారులను తవ్వకుపోతే.. ఇప్పుడు నిర్మాణం పూర్తైన తారు రోడ్లనూ ధ్వంసం చేస్తున్నారు. యర్రబాలెం వైపు నుంచి వీఐటీ యూనివర్సిటీ వైపు సుమారు 60 అడుగుల విస్తీర్ణంలో గత ప్రభుత్వం డివైడర్‌తో కూడిన తారు రోడ్డు నిర్మించింది.
అమరావతిలో కొనసాగుతున్న రహదారుల విధ్వంసం ఆ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో రహదారిపై తారును యంత్రాలతో తవ్వి పక్కనపోసి.. దాని కింద ఉన్న కంకర, డస్ట్, గ్రావెల్‌ను తరలించారు. అడుగున్నర లోతు వరకు ఉన్న మెటీరియల్‌ను తవ్వుకుపోయారు. ఒకేచోట 150 మీటర్లకు పైగా రోడ్లును తవ్వేశారు. సమీపంలో మరికొన్ని చోట్లా ప్రొక్లెయిన్లతో రోడ్లను తవ్వారు.
మందడం, కురగల్లు, యర్రబాలెం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వి తరలించుకుపోయారు. అక్కడ వాహనాలు తిరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలు దాటితే చాలు.. తమ ప్రాంతంలో దొంగలు జేసీబీలు, టిప్పర్లతో చొరబడి రహదారులను తవ్వుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్దండరాయునిపాలెం, మోదుగలింగాయపాలెం, రాయపూడి, ఐనవోలు, కృష్ణాయపాలెం పరిసర ప్రాంతాల్లో అక్రమార్కులు రహదారులను ధ్వంసం చేశారని.. ఇప్పుడు తమ ఊర్లపైనా పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా ఉంటున్న ఓ ప్రజాప్రతినిధికి తెలియకుండా.. మట్టి, కంకర దొంగతనాలు జరగవని చెబుతున్నారు. రోడ్డు తవ్విన ప్రాంతం సచివాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్నా.. అధికారులు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..