మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాను గెలిపిస్తే, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పట్టణ ప్రాంతాల్లో పన్నుల భారాన్ని 50 శాతానికి తగ్గిస్తామని శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. వైకాపా ప్రభుత్వం సామాన్యులపై ఆస్తి, నీటిపన్నులను భారీగా మోపిందని ధ్వజమెత్తారు. వైకాపా సర్కారు తీసుకొచ్చిన 198 జీవో ద్వారా మార్కెట్ విలువ ఆధారంగా ఆస్తి పన్నులు విధించటం దుర్మార్గమని మండిపడ్డారు.
"జగన్ ప్రభుత్వం తాగునీటి పైనా భారీగా పన్ను వసూలు చేస్తోంది. పట్టణ ఓటర్లకు ఉచితంగా తాగునీరు అందిస్తామని తెదేపా ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రహదారుల అభివృద్ధి కోసం రోడ్ డెవలప్మెంట్ సెస్ ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏడాదిన్నరగా వివిధ పన్నుల రూపంలో లీటరు పెట్రోలు లేదా డీజిల్ పై రూ.5అదనంగా రాష్ట్రంలో వసూలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి దుర్భరంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా నాణ్యమైన రహదారులు అందిస్తామని హామీ ఇస్తోంది." అని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు.