ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Electricity Charges: నెలకు రూ.1000 కోట్లు లోటు.. కరెంటు ఛార్జీలు పెంచక తప్పదు! - తెలంగాణలో కరెంటు ఛార్జీలు

ఆదాయం మెరుగుపరుచుకోకపోతే మరింత ఆర్థిక సంక్షోభంలో పడిపోతామని డిస్కం సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. నెలకు రూ. 1000 కోట్లకు పైనే లోటు వస్తున్నట్లు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ఈ నష్టాలు పూడ్చాలంటే.. ప్రభుత్వం నిధులైనా పెంచాలి.. లేదా కరెంటు ఛార్జీలు (Electricity Charges) పెంచి ప్రజల నుంచి వసూలు చేయాల్సి ఉంది.

Electricity Charges
Electricity Charges

By

Published : Nov 12, 2021, 9:32 AM IST

చ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచి కరెంటు ఛార్జీలు (Electricity Charges) పెంపు అనివార్యమని విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపాయి. ఛార్జీలు పెంచడం ద్వారా ఆదాయం మెరుగుపరుచుకోకపోతే మరింత ఆర్థిక సంక్షోభంలో పడిపోతామని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో రెండు డిస్కంలున్నాయి. అత్యధికంగా ఉత్తర తెలంగాణ సంస్థ పరిధిలో యూనిట్‌కు సగటున రూ. 2.50 దాకా నష్టం వస్తోంది. ఈ సంస్థ పరిధిలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ, వాణిజ్య నష్టాలు 34.49 శాతమని కేంద్రం ఇటీవల ప్రకటించింది. దక్షిణ తెలంగాణ డిస్కం పరిధిలో 15 శాతం దాకా ఈ నష్టాలున్నాయి. నష్టాలను పూడ్చటానికి ప్రభుత్వం రాయితీగా రెండు డిస్కంలకు కలిపి నెలకు రూ.873 కోట్లు ఇస్తున్నా ఇంకా యూనిట్‌కు సగటున 90 పైసల దాకా నష్టం వస్తున్నట్లు అంచనా. ఈ నష్టాలు పూడ్చాలంటే ప్రభుత్వం రాయితీ నిధులు మరిన్ని పెంచి అదనంగా ఇవ్వాలి లేదా కరెంటు ఛార్జీలు (Electricity Charges) పెంచి ప్రజల నుంచి వసూలు చేయాలి.

ఎందుకింత నష్టం..

డిస్కంలు విద్యుదుత్పత్తి కేంద్రాలకు ఒక్కో యూనిట్‌కు సగటు రూ. 4.32 చొప్పున చెల్లించినట్లు ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ) ఇటీవల నిర్ధారించింది. సరఫరా, పంపిణీ వ్యయం, ఇతర ఖర్చులు కలిపితే యూనిట్‌ ‘సగటు సరఫరా వ్యయం’ (ఏసీఎస్‌) రూ.7.14 దాకా అవుతోందని అంచనా. గతేడాది (2020-21)లో రాష్ట్ర ప్రజలకు 56,111 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) కరెంటు సరఫరా చేస్తే డిస్కంలకు రూ. 30,330 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఇంతకన్నా మరో రూ.9 వేల కోట్లు అదనపు వ్యయమైనట్లు అంచనా. ఈ ఏడాది (2021-22) ఆదాయ, వ్యయాల మధ్య లోటు నెలకు రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటుందని, దీన్ని పూడ్చుకోవాలంటే మరిన్ని రాయితీ నిధులు ఇవ్వాలని డిస్కంలు ఇటీవల ప్రభుత్వాన్ని కోరాయి. ప్రస్తుతం ప్రభుత్వం నెలకు రూ. 873 కోట్లను రాయితీ నిధుల కింద ఇస్తోంది. వీటిలోనే కొంత సొమ్మును ఎత్తిపోతల పథకాల మోటార్లకు వాడుకుంటున్న కరెంటు బిల్లు కింద చూపుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు వాడుతున్న కరెంటుకు బిల్లులు (Electricity Charges) చెల్లించడం లేదు. ఈ బకాయిలు రూ. 7,000 కోట్లకు చేరాయి. ఇవన్నీ కలగలసి డిస్కంలకు ఏటా నష్టాలు వస్తున్నాయి. 2019-20 నాటికే సంచిత నష్టాలు రూ. 36,000 కోట్లకు చేరాయని సీనియర్‌ అధికారి చెప్పారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచలేదని ఆయన వివరించారు.

ఎంత పెంచుదాం?

ఒక్కో యూనిట్‌పై ఎంత పెంచాలనే దానిపై డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. విద్యుత్‌ చట్టం ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘వార్షిక ఆదాయ అవసరాల’ (ఏఆర్‌ఆర్‌) నివేదికతో పాటు ఛార్జీల సవరణ ప్రతిపాదనలను ఈఆర్‌సీకి డిస్కంలు నవంబరు 30లోగా అందజేయాలి. గత రెండేళ్లుగా ఈ ప్రతిపాదనలను ఇవ్వలేదు. ఈ నెలాఖరులోగానైనా వచ్చే ఏడాది (2022-23)కి సంబంధించిన ఏఆర్‌ఆర్‌, ఛార్జీల పెంపు (Electricity Charges) ప్రతిపాదనలు ఇవ్వాలని యోచిస్తున్నాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్నందున వాటిని ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేస్తుందా లేదా ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని ఇస్తుందా అనేది ఇంకా తేలలేదు. ఏఆర్‌ఆర్‌ ఇవ్వడానికి ఎన్నికల కోడ్‌ వర్తించదని, అది ఇచ్చిన తరవాత బహిరంగ విచారణ జరిగి తుది ఉత్తర్వులు ఇవ్వడానికి వచ్చే మార్చి వరకు గడువు ఉంటుందని విద్యుత్‌ రంగ నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి:

Southern Zonal Council Meeting: ఏపీ కీలక ప్రతిపాదన.. వెల్లడించిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details