ఇప్పటికే ఈ కేసులో ముమ్మర దర్యాప్తు చేస్తున్న తెలంగాణ సీసీఎస్ (CCS POLICE INVESTIGATION)పోలీసులు ఈ స్కాంలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ఏపీ మర్కంటైల్ సహకార సంఘం మేనేజర్ పద్మావతి, యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్‌వలీ, ఏపీ మర్కంటైల్ సహకార సంఘం ఉద్యోగి మొయినుద్దీన్‌ను ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఏపీ మర్కంటైల్ సహకార సంఘం ఛైర్మన్ సత్యనారాయణను సైతం అరెస్ట్ చేశారు. ఈ నలుగురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అకాడమీకి చెందిన రూ.60 కోట్ల ఎఫ్‌డీలు దారి మళ్లించినట్లు గుర్తించారు. నకిలీ పత్రాలతో మర్కంటైల్ సహకార సంఘంలో ఖాతాలు సృష్టించి నిధులు (Telugu Academy Funds scam) మళ్లించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఇందుకు సహకార సంఘం ఉద్యోగులు సహకరించినట్లు తేల్చారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
అసలు స్కాం ఏంటి..
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ (Telugu academy scam).. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈనెల 28 లోపు తెలుగు అకాడమీ సిబ్బంది, చరాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. రాష్ట్ర విభజన నాటికి అకాడమీ వద్ద ఉన్న రూ.213 కోట్లను అధికారులు పలు బ్యాంకు శాఖల్లో డిపాజిట్ చేశారు. నిధులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 58: 42 నిష్పత్తిలో పంచుకోవాలి. ఆ ప్రకారం ఏపీకి రూ.124 కోట్లు ఇవ్వాల్సి ఉంది.