ప్రభుత్వ పాఠశాలల విలీనంతో విద్యార్థులకు చదువు భారంగా మారనుంది. బడులు, ఉపాధ్యాయుల సంఖ్య భారీగా తగ్గిపోనుంది. ప్రస్తుతం తమ గ్రామాల్లోని బడుల్లో చదువుతున్న పిల్లలు 1, 2 కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. 3, 4, 5 తరగతులు చదివే 8-9 ఏళ్ల వయసు చిన్నారులు పుస్తకాల సంచులు మోస్తూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సి వస్తోంది. కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో తరగతులను విలీనం చేస్తున్నామని అధికారులు చెబుతున్నా విద్యార్థుల ఇళ్ల నుంచి లెక్కిస్తే ఈ దూరం మరింత పెరుగుతోంది. మారుమూల గ్రామాల్లో రవాణా సదుపాయం లేనిచోట పిల్లలు నడిచి వెళ్లాలి. లేదంటే పెద్దలు పనులు మానుకుని, పిల్లల్ని ప్రతి రోజూ బడికి తీసుకువెళ్లి, తీసుకురావాలి. ఆటోల్లో పిల్లలను బడులకు పంపిస్తే రవాణా ఛార్జీలు భారమవుతాయి. ఇటీవల విద్యా హక్కు చట్టానికి సవరణ చేసినందున రవాణా ఛార్జీలను ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదు. బాలికల చదువుపైనా ఇది ప్రభావం చూపుతుంది. ఏటా తరగతుల తరలింపు కారణంగా పాఠశాలల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఉపాధ్యాయ పోస్టులు మిగిలిపోతాయి. ప్రాథమిక బడుల్లో మిగిలే 1, 2 తరగతులవల్ల అవి ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారతాయి. పాఠశాలల విలీనాన్ని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బుధవారమూ నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేశారు.
8 ఏళ్ల వయసువారు ఎలా వెళ్తారు?
ప్రస్తుతం ఉన్న నివాసానికి కిలోమీటరు దూరంలోని బడి నుంచి 3, 4, 5 తరగతులను మరో కిలోమీటరు దూరంలో ఉన్న ఉన్నత, ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేస్తే పిల్లలకు దూరం పెరగనుంది. మూడో తరగతి చదివే విద్యార్థుల వయసు 8-9 ఏళ్లు ఉంటుంది. ఈ వయసులో పుస్తకాల సంచులను మోసుకుంటూ 2 కిలోమీటర్లు ఎలా వెళ్లి రాగలుగుతారు? సైకిళ్లపై పిల్లల్ని పంపేందుకు తల్లిదండ్రులు భయపడతారు. కొన్నిచోట్ల ప్రధాన రహదారులను దాటాల్సి ఉంటుంది. అలాంటి చోట్ల పిల్లలు రోడ్లు దాటడం ప్రమాదకరమే. ఆటోలు, ఇతరత్రా రవాణా సాధనాలను వినియోగిస్తే ఆ ఛార్జీలు అదనపు భారంగా మారతాయి.
- అనంతపురం జిల్లా గలగల గ్రామంలోని పాఠశాలను గొల్లపల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. గలగల నుంచి వెళ్లాలంటే మధ్యలో వంక దాటాలి. వర్షాకాలంలో వంక పొంగితే విద్యార్థులు ప్రమాదాల బారినపడతారు. సత్యసాయి జిల్లా మడకశిర మండలం బెగార్లపల్లి పాఠశాలను మడకశిరలో విలీనం చేశారు. ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు. దారి మధ్యలో వంక ఉంది. వర్షాకాలంలో విద్యార్థుల రాకపోకలు ఇబ్బందికరమే.
- నెల్లూరు గ్రామీణ మండలంలోని కొండ్లపూడి 6, 7, 8 తరగతులను పొట్టేపాలెం ఉన్నత పాఠశాలలో కలిపారు. కొండ్లపూడి నుంచి విద్యార్థులు వెళ్లేందుకు ప్రధాన రహదారిని దాటాలి. ఇక్కడి నుంచి బస్సు సౌకర్యం లేదు. ఆటోల్లో వెళ్లాల్సిందే.
- ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఎడవల్లి ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ఉన్నత పాఠశాలకు వెళ్లే దారి మధ్యలో వాగు ఉంది. వర్షాకాలంలో ఇది పొంగితే ప్రమాదమే.
చివరికి మిగిలేవి 11వేలే..
తరగతుల విలీనం కారణంగా రాష్ట్రంలో చివరకు... 3-10 తరగతులుండే హైస్కూళ్లు, 3-12 తరగతుల హైస్కూల్ ప్లస్ బడులు 10,826 మిగులుతాయి. గతేడాది 250 మీటర్లలోపు, ఈ ఏడాది కిలోమీటరులోపు ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడుల్లో విలీనం చేస్తున్నారు. ఇవికాకుండా 100 మందిలోపు విద్యార్థులుంటే ప్రాథమికోన్నత బడుల నుంచి 6, 7, 8 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తున్నారు. వచ్చే ఏడాది రెండు, ఆ తర్వాత ఏడాది 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని విలీనం చేస్తే రాష్ట్రంలో దాదాపుగా ప్రాథమిక బడులు కనుమరుగవుతాయి. ఎల్కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతులుండే ఫౌండేషన్ బడులు, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ మాత్రమే మిగులుతాయి.