Millets Boosts Children Growth : బియ్యంతో కూడిన ఆహారం తీసుకొనే వారికంటే చిరుధాన్యాల ఆహారం తీసుకొనే పిల్లల్లో శారీరక వృద్ధి 26 నుంచి 39 శాతం ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఇక్రిశాట్‌కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఎస్.అనిత పేర్కొన్నారు. ఇందులో ఉండే ప్రయోజనాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పుట్టిన తర్వాత మొదటి మూడేళ్లు చాలా ముఖ్యమన్నారు. చిరుధాన్యాల ఆధారంగా పిల్లలకు ఆహారం ఇవ్వడం వల్ల వృద్ధి ఎలా ఉంటుందన్న అంశంపై ఇక్రిశాట్‌తోపాటు యు.కె.లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ న్యూట్రీషన్ అండ్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, యునిసెఫ్, ఎన్.ఐ.ఎన్ (హైదరాబాద్), ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (థాయిలాండ్) తదితర సంస్థలకు చెందిన పరిశోధకులు కలిసి అధ్యయనం చేశారు. దీనికి నాయకత్వం వహించిన అనిత ‘ఈనాడు-ఈటీవీ భారత్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరుధాన్యాల ప్రభావం, వాటివల్ల ప్రయోజనాల గురించి వివరించారు. ‘ఈనాడు’తో ఇక్రిశాట్ సీనియర్ శాస్త్రవేత్త ఎస్.అనిత
చిరుధాన్యాలపై మీ అధ్యయనంలో తేలిన ప్రధానాంశాలేంటి?
Millets Helps in Children Growth : బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలతో సాంప్రదాయక ఆహారం తీసుకొనే వారికంటే చిరుధాన్యాలతో తీసుకొన్న వారిలో ఎలాంటి ప్రయోజనం ఉంటుంది.. పౌష్టికాహార లోపాన్ని అధిగమించవచ్చా? అన్నదానిపై ఈ అధ్యయనం జరిగింది. బియ్యానికి బదులు చిరుధాన్యాలతో ఆహారం ఇచ్చి పరిశీలించాం. రెండేళ్లలోపు, అయిదేళ్లలోపు, 5-10 ఏళ్లు, 11-19 ఏళ్ల మధ్య వయసుల వారీగా ఈ అధ్యయనం జరిగింది. బియ్యం ఆధారంగా ఆహారం తీసుకొనే వారికంటే చిరుధాన్యాలతో క్రమం తప్పకుండా తీసుకొనే పిల్లల్లో వృద్ధి ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. వృద్ధిని గుర్తించడానికి ఎత్తు, బరువు, జబ్బ, ఛాతిలను పరిగణనలోకి తీసుకొంటాం. బియ్యం ఆధారిత ఆహారం కంటే చిరుధాన్యాలతో తీసుకొన్న వారిలో వృద్ది 26 నుంచి 39 శాతం ఎక్కువగా ఉంది. ఎత్తు పరంగా 28.2 శాతం వృద్ధి ఉంటే, బరువు 26 శాతం, జబ్బలో 39 శాతం, ఛాతిలో ఎదుగుదల 37 శాతం ఉంది.
పిల్లల వృద్ధికి ఎలాంటి చిరుధాన్యాలు ఉపయోగం?
Millets are Good For Kids Growth : అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాగులు పిల్లలకు చాలా ఉపయోగకరమైనవి. జొన్నలు కూడా చాలా మంచివని మేం చేసిన ఇంకో అధ్యయనంలో తేలింది. అన్ని చిరుధాన్యాలు (సామలు, సజ్జలు, రాగులు) కలిపి ఇవ్వడం కూడా చాలా మంచిదని మరో పరిశీలనలో తేలింది. భారతదేశంలో కూడా ఆహారంలోకి చిరుధాన్యాలను తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోంది. 2018లో నేషనల్ మిల్లెట్ మిషన్‌ను కేంద్రం ప్రారంభించింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీనిని బట్టి చిరుధాన్యాలకు ఉన్న ప్రాధాన్యం స్పష్టంగా తెలుస్తోంది. పోషకాల అవసరం వయసును బట్టి ఉంటుంది. యుక్త వయసులో అన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి.
దేశంలో పౌష్టికాహార లోపం ప్రధాన సమస్యగా ఉందంటారా?