తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్సుడ్‌లో ర్యాంకులు సాధించిన వారిలో కొందరు ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి 10 ర్యాంకుల్లో నిలిచారు. జేఈఈ అడ్వాన్సుడ్‌లో 173వ ర్యాంకర్ వావిలపల్లి సాయినాథ్ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించారు. అడ్వాన్సుడ్‌లో 2, 14 ర్యాంకర్లు గంగుల భువన్‌రెడ్డి, లండ జితేంద్ర ఎంసెట్‌లో 3, 10 ర్యాంకులు సాధించారు. తెలంగాణకు చెందిన కుమార్‌సత్యం జేఈఈ అడ్వాన్సుడ్‌లో 22వ ర్యాంకు సాధించగా ఎంసెట్‌లో రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఇంజినీరింగ్‌లో మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థులందరూ ఐఐటీల ప్రవేశాలపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ విభాగంలోని మొదటి ఐదుగురు నీట్‌లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌లో చేరతామని వెల్లడించారు.
వెయిటేజి ఇలా..
ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ విద్యార్థులు, 40 శాతం మార్కులు తెచ్చుకున్న రిజర్వేషన్ కేటగిరీల విద్యార్థులకే ఎంసెట్‌లో ర్యాంకులు కేటాయించారు. ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చారు. అడ్వాన్సుడ్ సఫ్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారికి ప్రస్తుతం ర్యాంకులు కేటాయించలేదు. వీరికి ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఎంసెట్ ర్యాంకు కార్డులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.