తెలంగాణలోని హైదరాబాద్ శివారు హిమాయత్‌సాగర్‌లో పరీక్ష కేంద్రం కాగా.. వారంతా హిమాయత్‌నగర్‌కు చేరుకున్నారు. తీరా హాల్‌టికెట్ చూసుకుంటే ఇక్కడ కాదని తేలింది. ముందుగా వచ్చారు కాబట్టి.. వెంటనే సరైన పరీక్ష కేంద్రానికి చేరుకొని ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాది సెప్టెంబరు 9న జరిగిన ఎంసెట్‌లో కొందరు విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవమిది... అందుకే విద్యార్థులంతా హాల్‌టికెట్‌పై పరీక్షా కేంద్రం ఉన్న ప్రాంతం, కేంద్రం పూర్తి పేరును ఒకటికి రెండుసార్లు క్షుణ్నంగా చదువుకోవాలి. ఒక్కోసారి పరీక్ష కేంద్రం పేరులో కొద్దిపాటి తేడా ఉంటుంది. అది గ్రహించకుంటే పరీక్ష సందర్భంగా ఒత్తిడికి లోనై నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెండేళ్లుగా హాల్‌టికెట్‌తో పాటు సూచనలు, పరీక్షా కేంద్రానికి రూట్‌మ్యాప్ సైతం ఇస్తున్నామని, తద్వారా పరీక్షా కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రాన్ని చూసుకొని రావడం మంచిదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 4 నుంచి ఎంసెట్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈసారి ఎంసెట్ ఇంజినీరింగ్‌కు 1,64,962.. అగ్రికల్చర్, ఫార్మసీకి 86,644... మొత్తం 2,51,606 దరఖాస్తులు అందాయన్నారు. కొవిడ్ పాజిటివ్ ఉంటే చివరి రోజు ప్రత్యేక పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయిస్తామన్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్ విభాగం పరీక్ష జరగనుంది.
వెయిటేజీ లేదు... అశ్రద్ధ వద్దు